అభివృద్ధి పనుల కోసం చేపట్టిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.  సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో భూసేకరణ అంశంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైల్వే, సోలార్ ప్రాజెక్ట్స్, జాతీయ రహదారుల నిర్మాణం, విమానాశ్రయం లో నైట్ ల్యాండింగ్ కు అవసరమైన భూసేకరణ తదితర అంశాలలో నిర్ధేశించిన భూసేకరణ ఎంత, సాధించిన ప్రగతి, మిగిలిన లక్ష్యం ఎంత, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఇంకను సాధించాల్సిన లక్ష్యం లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటికి గల పరిస్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రొద్దుటూరు పట్టణం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 67వ జాతీయ రహదారి లో 7.11 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి త్వరలో ధర నిర్ణయం చేసి అవార్డ్ పాస్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు ఆర్డిఓ ను ఆదేశించారు. ర్రహదారుల విస్తరణలో భాగంగా కడప నుండి కర్నూలు దారిలో 641.45 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందని, మిగిలిన 1.85 ఎకరాల భూమిని దువ్వూరు, చెన్నూరు తసీల్ధార్ల నుండి వెంటనే స్వాధీన పరుచుకోవాలని ఎన్ హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, నంద్యాల వారిని ఆదేశించారు. ఎన్ హెచ్ 18లో రాయచోటి – కడప, ఎన్ హెచ్ 340లో రాయచోటి- అంగళ్లు, ఎన్ హెచ్ 167బిలో పోరుమామిల్ల నుండి సీతారమపురం మీదుగా సి ఎస్ పురం వరకు 2 లైన్ల రహదారి విస్తరణ పనులకు రీహాబిలిటేషన్, అప్ గ్రేడేషన్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఆర్డిఓ లు, ఎన్ హెచ్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంఛార్జి జేసీ నాగేశ్వరరావు, ఇంఛార్జి జేసీ2 రామచంద్రా రెడ్డి, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డిఓలు దేవేందర్ రెడ్డి, వీరబ్రహ్మం, నాగన్న, ఎన్ హెచ్ ఇఇ ఓబులరెడ్డి, ఏపీ ఐ ఐ సి జెడ్ ఎమ్ జయలక్ష్మి, ఆర్ అండ్ బి ఇఇ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.