ysrkadapa

రాచపాలెం

మెరుగైన సమాజం కోసం సాహిత్యం

చచ్చుపుచ్చుకైత పచ్చిశృంగారాన
చెప్పికవులు మున్ను మెప్పుగనిరి
నీతినష్ఠలెల్ల నిప్పులపాలాయె
కాళికాంబ/హంస!కాళికాంబ
పూర్వం సారంలేని కవితలలో బూతు శృంగారం నింపి కవులు ప్రశంసలు పొందారు. కానీ వాళ్ళ కవిత్వం వల్ల సామాజిక నీతి నియమాలు మంటలో కాలిపోయాయి. ప్రబంధయుగ కవిత్వం మీద బ్రహ్మంగారు ఇచ్చిన తీర్పు ఇది. ప్రబంధయుగాన్ని పూర్వప్రబంధ యుగమనీ ఉత్తర ప్రబంధ యుగమనీ రెండు విభాగాలు చేశారు చరిత్రకారులు. ప్రబంధాలన్నీ వర్ణన ప్రధానమైన కావ్యాలు. వాటిలో కొన్నిటిలో భక్తి ఉన్నా శృంగారం అతివేలంగా చిత్రింపబడింది. ప్రధానంగా నాయిక పాత్రను వర్ణించడంలో కవులు హద్దులు చెరిపేశారు. రాజులను మెప్పించడానికిగానీ మరోదానికిగానీ ప్రబంధనాయికలను తలవెంట్రుకల నుండి కాలిగోళ్ళదాకా ఇష్టం వచ్చినట్లు ఉపమానాలతో ముంచెత్తారు. ఇందులో పోటీలు పడ్డారు. నాయికల ఏడ్పులలో ఒకడికి కాంభోజీరాగం వినిపిస్తే ఇంకొకడికి మరోరాగం వినిపించింది. నాయికా నాయకులు పెళ్ళి చేసుకొని పడగ్గదిలోకి వెళ్ళినా కవులు వాళ్ళను వదిలిపెట్టకుండా అమ్మాయిని అబ్బాయి ఎలా లోబరచుకున్నదీ అబ్బాయి ఒకమ్మాయిని పెళ్ళి చేసుకుని నిద్రలో మరో అమ్మాయిని కలవరిస్తే ఈకట్టుకున్నావిడ ఎలా అలిగిందీ ఆయన ఆఅలుకను ఎలా తీర్చిందీ వర్ణించి వర్ణించి తరించిపోయారు కవులు. మొగ కవుల రాసిక్యతనంతా ప్రబంధాలలో ఒలకబోశారు. మరీ ఉత్తర ప్రబంధయుగంలో ఈవర్ణనలు మితిమీరిపోయాయి. సాహిత్యమంటే జీవిత ప్రతిఫలనమనీ జీవితమంటే మనవ సంబంధాల సమాహారమనీ వాటిలో స్త్రీపురుష సంబంధాలు మిగతా మానవ సంబంధాల కన్నా ముఖ్య మైనవనీ వాటిని గంభీరంగా చిత్రించాలనీ వాళ్ళు భావించినట్లులేదు. అలంకారశాస్త్రాల ఆజ్ఞలకు తలలువంచి కవులు భావదారిద్ర్యాన్ని ప్రదర్శించారు. ఆరోజుల్లో కావ్యనాయికలకు ప్రబంధకవులు వేసిన నానిరకాల విశేషణాలను ఈమధ్య కొందరు ‘శృంగారులు’ కుప్పబోసి వాట్సప్ లలోబెట్టి అదంతా తెలుగుభాష ఘనత అని భ్రమపడి మురిసిపోతున్నారు. కంబుకంఠి తామరసాక్షి కఠినస్తని నితంబిని సింహమధ్య గజగామిని ఇలా స్త్రీశరీరం నిండా విశేషణాలు నింపేశారు. స్త్రీలను అందగత్తెలుగా తప్ప మనుషులుగా చూడలేదు వాళ్ళు. కట్టమంచి రామలింగారెడ్డిగారు మొదటిసారిగా ఈ ప్రబంధ శృంగారం మీద తవ్రమైన విమర్శ పెట్టారని ఆధునిక విమర్శకులు చెబుతారు. కాదు ఆయనకన్నాముందే బ్రహ్మంగారే అనుచితమైన చచ్చు పుచ్చు శృంగారం మీద దాడి ప్రారంభించారు. దీని దుష్ఫలితాన్నికూడా బ్రహ్మంగారు గుర్తించారు. సాహిత్యం సమాజం మెరుగైన సమాజంగా మారడానికి దోహదం చెయ్యాలి. కానీ శృంగారకావ్యాలు నీతి నిష్ఠలను కాల్చి బూడిద చేశాయట. అంటే శౄంగార కావ్యం సమాజానికి మేలు చేయకపోగా కీడు చేశాయని ఆయన విమర్శించారు. అందుకే ఆయన స్త్రీకి అత్యున్నత స్థానమిచ్చారు తనకవిత్వంలో. స్త్రీలేకుండా సృష్టి జరగదన్నారు. ఇంట్లో తల్లిని పూజించమన్నారు. బయటి స్త్రీలను తల్లులుగా గౌరవించమన్నారు. ఒకరకంగా బ్రహ్మంగారు ప్రాచీన తెలుగుసాహిత్య స్త్రీ చరిత్రను తిరిగి రచించారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర స్త్రీని గౌరవిస్తూ మొదలయ్యింది. అందుకు బ్రహ్మంగారిలో మూలాలున్నాయి.

Leave a Comment