ఖరీఫ్ కాలంలో సాగునీరు ఇచ్చేందుకు వీలుగా మైలవరం ప్రాజెక్టు ఉత్తరకాల్వలో పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని  జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులతో కలసి మైలవరం జలాశయాన్ని, ఉత్తకాల్వను పరిశీలించారు.  ఉత్తర కాల్వలో  జమ్ము పెరగడంతోపాటు పూడిక  పేరుకు పోయిందని దీనివల్ల కాల్వకు నీరొదిలినా ప్రయోజనం ఉండదని జీఎన్ఎస్ఎస్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. జలాశయంలో ప్రస్తుతం 3.2 టీఎంసీ నీరు నిల్వ ఉందని జలాశయం నుంచి 2 టీఎంసీలు,  గండికోట నుంచి అర్ధ టీఎంసీ మొత్తం రెండున్నర టీఎంసీల నీరు వదలవచ్చని అధికారులు వివరించారు.  మైలవరం జలాశయం 13 ప్రధాన గేట్లకు 13 గ్రామాల పేర్లు రాయించాలని,  డ్యామ్ వద్ద లైటింగ్, బోటింగ్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా ఇర్రిగేషన్, టూరిజం గెస్ట్ హౌస్ లను, అక్కడ అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం ఇరిగేషన్ ఈఈ సుధాకర్, తహసీల్దారు షేక్ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.