పురుషాధిపత్యంపై తిరుగుబావుటా

రాచపాలెం
355 Views
పురుషాధిపత్యంపై తిరుగుబావుటా
సోమయాజి భార్య సోమిదేవమ్మైన
పాకయాజి భార్య పాకియగును
సోమి, పాకి పాట్లు చూడశక్యముగాదు
కాళికాంబ! హంస! కాళికాంబ

<

సోమరస సంబంధమైన యజనం చేసిన వ్యక్తి సోమయాజి. ఆయన భార్య సోమిదేవమ్మ అయితే పాకము అంటే  వంటలు చేసే వ్యక్తి పాకయాజి. అతని భార్య పాకి అవుతుంది. ఇంట్లో ఈ ఇద్దరి బాధలు అగచాట్లు చూడడానికి సాధ్యం కాదు. ఇంటి స్త్రీలను గురించి బ్రహ్మంగారి అభిప్రాయం ఇది. కుటుంబవ్యవస్థలో స్త్రీల శ్రమను గురించి బ్రహ్మంగారు ఎంత ముందుచూపుతో ఆలోచించారో చూడండి. ఏవర్ణస్త్రీ అయినా ఇంటిలో చాకిరీ చేయడం తప్ప మరో పనిలేదు. ఇద్దరి మధ్య కుల భేదమున్నా ఇద్దరి శ్రమలో తేడాలేదని గుర్తించారాయన. సోమయాజి సోమిదేవమ్మ అనే మాటలు వ్యవహారంలో ఉన్నాయి గానీ పాకయాజి పాకి అనే మాటలు బహుశా బ్రహ్మంగారు సృష్టించారు. కుల వ్యవస్థలో సోమిదేవమ్మ పాకి కన్నా పైస్థాయిలో ఉన్నా  ఆయిద్దరూ ఆడవాళ్ళే ఇద్దరి పనీ ఇంటి చాకిరీనే అని ఆయన చెప్పదలచుకున్నారు. ఇవాళ ఈమాట ఎవరన్నా అంటే పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. మూడువందల ఏళ్ళక్రితం భూస్వామ్యవ్యవస్థ బలంగా ఉన్నరోజుల్లో బ్రహ్మంగారు ఇలా అనడం ఆయన ముందుచూపు. స్త్రీలను గౌరవించమని అనడం వాళ్ళను తల్లులుగా చూడమనడం ఇది ఒక పార్శ్వం. వాళ్ళశారీరక శ్రమను గుర్తించడం విశేషం.  మధ్యయుగ కవులు  స్త్రీల శరీరాలను అంగాంగవర్ణన చేస్తూ పరవశించిపోతున్నకాలంలో ఒక తాత్వికకవి స్త్రీశ్రమ పక్షం వహించడం మనం గుర్తించాలి. ఇప్పటికీ సినిమాలు ఆధునిక ప్రబంధాలలాగా స్త్రీ అవయవాలను ప్రదర్శించి సొమ్ము చేసుకుంటున్నాయి. నేటి వ్యాపార సినిమాలతో పోల్చి చూస్తే బ్రహ్మంగారి వాస్తవిక దృష్టి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. పురుషాధిపత్యం మీద ఆనాడే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన బ్రహ్మంగారు ఇంకా ఏమన్నారో చూడండి.
మూడుయుగములందు  ముదితలు ముగ్ధలు
పురుషదౌష్ట్యమునకు పొగిలినారు
కలియుగాన కాంత లిలనేలగలరయా
కాళికాంబ! హంస! కాళికాంబ
కృత , త్రేత , ద్వాపరయుగాలలో  అన్నివయసుల స్త్రీలూ పురుషుల దుర్మార్గాలకు బలైపాయారు. కానీ కలియుగంలో మహిళలు భూమిని పరిపాలిస్తారు. ఇది ఆయన కాలజ్ఞానం. కాలజ్ఞానం అంటే ఉన్నపరస్థితులను బట్టి రాబోయే మార్పులను గుర్తించడం.  ఇప్పుడు నడుస్తున్నది కలయుగం అని సంప్రదాయవాదులంటారు. బ్రహ్మంగారు చెప్పినది కాలం ఎప్పుడూ ఒక వర్గానికే అనుకూలంగా ఉండదని పీడితవర్గాల చైతన్యంలోంచి సామాజిక మార్పు రాక తప్పదని, ఇప్పటికే భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాలలోనూ చాలా రాష్ట్రాలలోను మహిళలు రాజ్యాధికారానికి వచ్చారు. ప్రపంచమంతా ఇవాళ మహిళా చైతన్యం పెల్లుబుకుతున్నది. అయితే ఆమేరకు వాళ్ళపైన దౌర్జన్యాలూ పెరుగుతున్నాయి. పురుషులలో స్త్రీపట్ల దృష్టి మారవలసినంతగా మారలేదు. స్త్రీపట్ల మధ్యయుగ భావజాలం ఇంకా కొనసాగుతున్నది. దానిని అరికట్టడానికి ఆధునిక చైతన్యంతోబాటు మధ్యయుగకవి బ్రహ్మంగారు పూర్వరంగంగా ఉపయోగపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *