ysrkadapa

వార్తలు

అత్యున్నత ప్రమాణాలతో రిమ్స్ లో వైద్య సేవలు అందించాలి

వైద్య సేవల్లో అత్యున్నత ప్రమాణాలతో రిమ్స్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అందుకు వైద్యులు, పరిపాలన యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు. శుక్రవారం రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందిస్తూ రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా గుర్తింపు పొందుతోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన వైద్యసేవలతో.. వేలాది మంది ప్రజలకు ప్రతి నిత్యం ప్రాణ రక్షణ కల్పిస్తున్న రిమ్స్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. జూలై నుంచి అన్ని విభాగాల్లో వైద్య సిబ్బంది వందశాతం అటెండెన్స్ ఉండాలని, ఎమర్జెన్సీ సర్వీసులను 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. క్యాజువాలిటీ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. సిటీ, ఎం.ఆర్.ఐ., ఎక్స్ రే విభాగాల్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలని, ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ ప్రదేశాలను క్రమబద్దీకరించాల సూచించారు. బయటి నుంచి వచ్చే ప్రయివేటు అంబులెన్స్ లతోపాటు ఇతర వాహనాలను నిర్ధేశించిన ప్రదేశంలో ఉండాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో రిమ్స్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, నేత్ర వైద్యశాల, మానసిక వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయని, రాయలసీమలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్ హబ్ గా కడప రిమ్స్ మారనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ, రిమ్స్‌ సూపరింటెండెంట్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వర రావు, రిమ్స్ ప్రిన్సిపాల్ సి.ఎస్.ఎస్. శర్మ, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, డిడి శ్రీనివాసరావు, డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కో. ఆర్డినేటర్ డా.రమేష్ తదితరులు పాల్గొన్నారు.