జూన్‌ 2నుంచి చేపట్టే నవ నిర్మాణ దీక్షలను విజయవంతం చేయాలని జిల్లా పాలనాధికారి హరికిరణ్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి నవనిర్మాణ దీక్ష కార్యక్రమ నిర్వహణపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్‌ 2వ తేదీ నుంచి  8వతేదీ వరకు చేపట్టే నవనిర్మాణ దీక్షకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు.  అధికారులు దీన్ని పాటించి దీక్షలను విజయవంతం చేయాలన్నారు. 2014 నుంచి 2017 వరకు కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 2018-19 లక్ష్యాలు, గ్రామ పంచాయతీ, వార్డు స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీరు, సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ప్రగతి శాఖల వారీగా నివేదికను రూపొందించి వాటిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిరోజు జిల్లా, మున్సిపాలిటీ, మండలం, గ్రామస్థాయిలో నిర్ధేశించిన కార్యక్రమాలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాలన్నారు.  పర్యవేక్షణకు నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన హామీల అమలుపై చర్చ, 3న నీటి భద్రత, కరువు రహిత రాష్ట్రం,  4న రైతు సంక్షేమం, ఆహారభద్రత, 5న సంక్షేమం, సాధికారత, 6 జ్ఞానభూమి, ఉపాధికల్పన 7న మౌలిక సదుపాయాలు 8న అవినీతిరహిత సమాజం అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. జిల్లా, మండలం, గ్రామస్థాయి అధికారులు నవ నిర్మాణ దీక్షలో మమేకమై విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు.