ysrkadapa

వార్తలు

రాజోలి జలాశయంపై నిర్లక్ష్యమేల

రాజోలి జలాశయం

రాజోలి జలాశయం కలగా మారుతోంది.  ఊరించడం తప్పితే సాధించుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.  ఫలితంగా కేసీకాల్వ ఆయకట్టు కింద పంటల సాగుకు భరోసా కరవైంది.  రాజోలి జలాశయం ఆవశ్యకతను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు రఘురామిరెడ్డి ప్రశ్నిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు హామీతోనే సరిపెడుతున్నారు. ఇటీవల మైదుకూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడులోనూ రాజోలి జలాశయం నిర్మించాలని ప్రతిపాదన చేశారు. మినీ మహానాడు తీర్మానించింది. అయితే ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.  వాస్తవానికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి  రాగా ముఖ్యమంత్రిగా నియమితులైన జిల్లా వాసి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణానదిపై ఆధారపడిన శ్రీశైలం జలాయానికి వరదనీరు చేరకపోతే జిల్లాలోని కేసీకాల్వ ఆయకట్టును బీడు భూములుగా వదిలేసుకోక తప్పదు. అటు తాగు ఇటు సాగుకు భరోసా కల్పించేలా కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులో  కుందూనదిపై నిర్మించిన  రాజోలి ఆనకట్ట వద్ద 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2008 డిసెంబరు 23న శంఖుస్థాపన చేశారు. రూ.291.02 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఆతర్వాత 2009 ఎన్నికల రావడం.. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మృతి చెందడం… ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు పట్టించుకోలేదు. సకాలంలో నిర్మాణం చేపట్టక పోవడంతో 2014నాటికి అంచనా వ్యయం రూ. 448.35 కోట్లకు చేరింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన ప్రస్తుత తెదేపా జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి తెదేపా అధికారంలోకి వస్తే రాజోలి జలాశయం నిర్మిస్తామని హామీ ఇచ్చినా దాని ఊసేలేదు. 2015 జూన్‌ 7న ఖాజీపేట మండలం పేరారెడ్డి కొట్టాలు వద్ద నిర్వహించిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో  పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి రాజోలి జలాశయం అంశాన్ని ప్రస్తావించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై సమాధానం ఇవ్వకుండానే దాటవేశారు.
కోస్తా రైతుల ప్రయోజనాలను కాపాడేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.1600 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నినిర్మించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు గుప్పించినా  ఖాతారు చేయలేదు. ఏడాది కాలంలోనే పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నారు.  గోదావరి నది నుంచి నీరు  ఎత్తిపోసి పంటలు సాగు చేసుకునేలా చేశారు.  మరి రాజోలి జలాశయం విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదన్నదే ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఏటా నిర్వహణ కోసం అవసరయ్యే ఖర్చుతోపాటు విద్యుత్తు ఛార్జీల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేయక తప్పదు.

రాజోలి జలాశయం

రాజోలి జలాశయం నిర్మిస్తే

రాజోలి జలాశయం నిర్మిస్తే కర్నూలు, కడప జిల్లాలో కురిసే వర్షపునీరు నిల్వ చేరుతుంది.  శ్రీశైలం జలాశయం నుంచి నీరందక పోయినా..  అరకొర వర్షాలతో రాజోలి జలాశయానికి చేరే నీటితో కనీసం ఆరుతడి పంటలైనా రైతులు సాగు చేసుకునే  అవకాశం ఉంటుంది. తాగునీటి సమస్య తొలగి పోతుంది. ప్రభుత్వం పట్టిసీమపై పెట్టిన శ్రద్ధ రాజోలి జలాశయం నిర్మాణం విషయం చొరవ చూపక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రాజోలి జలాశయం నిర్మిస్తామని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.  2019 ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈలోగా రాజోలి జలాశయం నిర్మాణానికి చొరవ చూపి ఆయకట్టు రైతుల మన్ననలను చూరగొంటుందా లేదా అనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది.

Leave a Comment