విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సూపరువైజర్లు, అంగన్వాడీ వర్కర్స్ ను ఆదేశించారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ తో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్రాన్ని పూర్తిగా పరిశీలించి సీడీపీఓ వసంత బాయీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నేడు మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలు, కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. లక్కిరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉండటంతోపాటు, కేంద్రాన్ని వారంలో 2, 3 రోజులు తెరవడం లేదని, సీడీపీఓ, సూపరువైజర్లు, వర్కర్స్ గొడవలు పడుతూ సరిగా పని చేయడం లేదని, తద్వారా లక్ష్య సాధనలో ప్రగతి సాధ్యం కావడం లేదని పలు ఫిర్యాదులు అందాయన్నారు. డేటా నమోదులో జిల్లాలోనే కేంద్రం వెనుకబడి ఉందన్న విషయం దృష్టికి వచ్చిందని, వాస్తవ విషయాల నిర్దారణ కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం జరిగిందన్నారు. దీనిపై వాస్తవాలు తెలపాలని అంగన్వాడీ వర్కర్స్ ను మంత్రి అడుగగా… సూపరువైజర్లు తమకు సమాచారం సరిగా అందజేయడం లేదని, 7 నెలలుగా మాట్లాడటం లేదని, పర్యవేక్షణ లేని కారణంగా లక్ష్యాల సాధనలో వెనుకబడినట్లు వర్కర్స్ వివరించారు. త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రానికి కోడిగుడ్లు, పాలు సరఫరా ఎలా ఉంది, సక్రమంగా వస్తున్నాయా లేదా అని మంత్రి ఆరాతీశారు. కొన్నిసార్లు మరీ చిన్న గ్రుడ్లు వస్తున్నాయని, టెట్రాప్యాక్ పాలు వస్తున్నట్లు తెలిపారు. చిన్న గుడ్లు, వాసన వచ్చే పాలు వస్తే తిప్పి పంపాలని మంత్రి సూచించారు. మినీ అంగన్వాడీ వర్కర్ల పనితీరు, వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక కమీషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ… మీకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. మే నెల వరకే డేటా నమోదు చేశారు. తాజా సమాచారం ఎందుకు నమోదు చేయలేదని వర్కర్స్ ను ప్రశ్నించారు. డేటా ఎంటర్ చేయగలిగిన వారు చేస్తున్నామని, అర్థం కాని వారు ఆన్లైన్ లో నమోదు చేయలేకపోతున్నట్లు వర్కర్స్ వివరించారు. దీనిపై ప్రత్యేక కమీషనర్ మాట్లాడుతూ… ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ తో ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తోంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలు, సమస్యలు వల్ల ప్రగతి కుంటుపడుతోంది. ప్రాజెక్ట్ ఉద్దేశ్యాలను సాధించేందుకు అందరూ ఒకటిగా ఉండాలి. సమస్యలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెంటర్ పరిధిలో ఉన్న గర్భిణీలు, రక్తహీనత గల మహిళల వివరాలు, ఫోన్ నెంబర్లు తమ వద్ద ఉన్నాయని, అమరావతి నుంచే వారితో వర్కర్స్ ఎలా పని చేస్తున్నారు, వారానికి ఎన్ని రోజులు కేంద్రాన్ని తెరుస్తున్నారు, వస్తువులు సక్రమంగా అందజేస్తున్నారా లేదా తదితర వివరాలను నేరుగా తెలుసుకుంటామని, విధులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. లాంగ్ స్టాండింగ్ సూపర్ వైజర్స్ను బదిలీ చేయాలని, కేంద్ర పరిధిలో కార్యక్రమాలు పర్యవేక్షించడానికి రెగులర్ సీడీపీఓ ను అక్కడ నియమించాలని ఐసిడిఎస్ పిడి పద్మజను ఆయన ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామ పంచాయతీ ఆమోదంతో రూ 5 వేల వరకు ఐసిడిఎస్ కేంద్రానికి అవసరమైన వస్తువులు కొనడానికి మార్గదర్శకాలు ఇచ్చామని, సర్పంచ్ లను అడిగి కేంద్రానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ప్రత్యేక కమీషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి జేసీ 2 రామచంద్రా రెడ్డి, సీడీపీఓ వసంతబాయీ, ఎంపిడిఓ రవికుమార్ రెడ్డి, తహసీల్దార్ రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి నాయకులు రమేష్ కుమార్ రెడ్డి, రాయచోటి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఖాదర్ భాష, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, అంగన్వాడీ సీడీపీవోలు, సూపరువైజర్లు, వర్కర్స్, మినీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.