నిర్భాగ్యులు

రాచపాలెం
395 Views


నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు
విగ్రహములకెల్ల విందుచేసి
భోగభాగ్యములను బొందకాంక్షింతురు
కాళికాంబ!హంస! కాళికాంబ!

ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో బ్రహ్మంగారు ఈపద్యం ద్వారా ముందు వరసలో నిలబడ్డారు. మనిషి తనజీవితం సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవడం అందుకు అవసరమైన సంపదను సమకూర్చుకోవడం తప్పుకాదు. ఇది భౌతిక జీవితానికి సంబంధించిన  కోరిక. ఇది నెరవేరాలంటే భౌతికంగానే ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయాలి. నియమబద్ధమైన జీవితం గడపాలి. అవసరమైతే అదనపు శ్రమ చెయ్యాలి. నాగరికమైన పద్ధతిలో అయితే ఇది.  లేదూ కొన్నితరాలకు సరిపడే సంపదను ఇప్పుడే పోగుజేసి పెట్టెయ్యాలి, ఎవడెక్కడన్నాపోనీ, నీతినియమాలుండాలనుకోవడం చాదస్తం, నలుగుర్ని ముంచైనా నేను ఎదిగిపోవాలి అనికూడా అనుకోవచ్చు. అదికూడా భౌతిక, సామాజిక విషయమే. అది న్యాయమైన పద్ధతికాదు. అయినా  నలుగుర్ని కాదని ఒక్కడే బాగుపడాలనుకోవడమన్నది కూడా భౌతికమైన కోరికే. అదినెరవేరాలంటే  భౌతికమార్గమే శరణ్యం. నాగరిక పద్ధతిలో అభివృద్ధిలోకి రావాలన్నా అడ్డదారులలో పైకి రావాలన్నా మానవ ప్రయత్నమే శరణ్యం. మరొకదారిలేదు. వాస్తవం ఇలా ఉండగా గుడులలో విగ్రహాలకు విందులుచేస్తే సంపద సిద్ధిస్తుంది అని సంపదనంతా విగ్రహాల మీద ఖర్చుచేయడం దండగ అని బ్రహ్మంగారి ప్రబోధం. భోగభాగ్యాలకోసం విగ్రహాలకు విందులు చేసేవాళ్ళు నిర్భాగ్యులు అన్నారాయన. ఇవాళ విగ్రహాల మీద మన సమాజంలో జరుగుతున్న కార్యకలాపాలను చూస్తుంటే బ్రహ్మంగారు ఇవాల్టి సమాజాన్ని చూసే ఈపద్యం చెబుతున్నారా అనిపిస్తుంది. ఈపద్యం ఆయన  చెప్పిన నాటికి ఎంత ప్రాసంగికమో నేటికి అంతకన్నా ఎక్కువ ప్రాసంగికం. విగ్రహాలను పెట్టడం, వాటికి గుళ్ళు కట్టడం దాని చుట్టూ ఒకవర్గం చేరడం దానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు రూపొందించడం , దానిచుట్టూ ఆర్థికాంశం ఆవరించడం, ప్రజల్ని భక్తులుగా తయారు చేయడం, అందుకు విశ్వాసాల రూపంలో ఆశలు కల్పించడం.. ఇదంతా ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక. కష్టపడి సంపాదించుకోవలసిన సంపద విగ్రహాలకు విందులు చేస్తే సిద్ధిస్తుందనుకోవడం మౌఢ్యం అని బ్రహ్మంగారు చాటి చెప్పారు. విగ్రహారాధన నుంచి మనం విముక్తం కాగలిగితే మనదేశం వైజ్ఞానికంగా అగ్రదేశం కాగలదు. నూటమూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపగలిగిన మేధస్సు భారతదేశానికుంది. అయినా ఆనమూనాను తీసుకుపోయి విగ్రహాల ముందు పెట్టడం వైరుధ్యం. మనదేశం ఈవైరుధ్యం నుంచి బయటపడాలి. ఇదుకు బ్రహ్మంగారు సహకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *