ysrkadapa

రాచపాలెం

దోపిడీరహిత సమాజ నిర్మాణం

స్వీయసౌఖ్యములకు వెంపరలాడుచు
క్రూరముగను పరుల కొల్లగొట్టు
మానవుండు ముందుమార్గమ్ముగానడు
కాళికాంబ!హంస!కాళికాంబ!
సొంత సుఖాల కోసం ప్రాకులాడుతూ ఇతరులను అత్యంత దారుణంగా క్రూరంగా దోచుకునే వాడు భవిష్యత్తులో పట్టబోయేగతిని గుర్తించడు.  అక్రమపద్ధతిలో  అమానుష రీతిలో బతికేవాడిని బ్రహ్మంగారు ఇలా హెచ్చరించారు. ఈ పద్యం బ్రహ్మంగారి సమాజ పరిశీలనకూ లోకానుభవానకీ     నిదర్శనం. అసమ సమాజంలో అనాగరిక వ్యవస్థలో ఒకరిని ఇంకొకరు పీడించి బతకడం ఉంటుంది. అయితే ప్రజా దృక్పథం గల కవి ఈ అమానుషత్వాన్ని సహించడు. ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా బలవంతులైనవారు బలహీనులను కొల్లగొట్టడం చరిత్ర చాటిన వాస్తవం. బలవంతులు దుర్భలజాతిని బానిసలను కావించారు అన్నారు శ్రీశ్రీ. ఇలా దోచుకునేవాళ్ళకు వర్తమానమే గుర్తుకుంటుంది. జరగబోయే దానిని గురించి ఆలోచించరు అని బ్రహ్మంగారు గుర్తు చేశారు. కాలం ఎప్పుడూ ఒకడికే అనుకూలంగా ఉండదనీ కాలం ఎప్పుడూ ఒకేతీరుగా ఉండదనీ దోపిడీవర్గం తెలుసుకోడు. దీనినే బ్రహ్మంగారు ముందు మార్గమ్ము గానడు అని అన్నారు. ఈమాటకు సంప్రదాయార్థమూ ఆధునికార్థమూ చెప్పుకోవచ్చు. పీడితులు భరించగలిగినంతకాలం  భరించి ఎప్పుడో తిరగబడి దోపిడీకి సమాధి కడతారు. దీనిని స్వార్థపరుడైన దోపిడీగాడు తెలుసుకోడు అన్నది ఆధునికార్థం.  అమాయకులను పీడించే వాడికి ఎప్పుడో చేటుగాలం దాపురిస్తుంది. దానిని వాడు తెలుసుకోలేడు అన్నది సంప్రదాయార్థం. యవ్వనంలో ఉన్నవాడు అనేకులను అనేకరకాలుగా దోచుకుంటూ ఉంటాడు. యవ్వనం పోయాక యవ్వనంలో చేసిన దుర్మార్గాలు వెంటాడుతాయి. అప్పుడతడు నిస్సహాయుడుగా మిగిలిపోతాడు. ఈ వాస్తవాన్ని తెలుసుకోమని బ్రహ్మంగారు హెచ్చరించారు. ఒక కులంవాడు మరో కులం వాళ్ళను ఒకమతం వాడు మరో మతంవాడిని ఒక మొగవాడు మరో మహిళను పీడించి దోచుకుంటే అది ఊరకేపోదు. ఎప్పుడో ఒకసారి పరిస్థితులు మారినప్పడు పట్టికుడుపుతుంది దానిని ముందే తెలుసుకొని మసలుకోండని  బ్రహ్మంగారిబోధ. ముందు మార్గము అంటే నరకం అనికూడా చెప్పుకోవచ్చు.. బ్రహ్మంగారు హింసావ్యతిరేకి. శాంతికాముకుడు. ఆధిపత్య వర్గాల దోపిడీ పీడన సంస్కృతిని ఆయన ప్రతిఘటించారు. దోపిడీ పీడనా అధర్మంలేని సమాజం ఆయన స్వప్నం. మనిషిలో ఏమాత్రం  దుర్మార్గమున్నా ఆయన ఉపేక్షించలేదు.  క్రూరులు సత్పురుషులుగా మారాలని సమాజం మంచిదిగా మారాలని ఆయన ఆకాంక్ష. ఆధ్యాత్మిక ప్రబోధంతో కూడా ఆయన సమాజాన్ని మార్చడానికి కృషిచేశారు.
జనుడు కోరలున్న సర్పమ్ము కారాదు
తోడెలవుట మంచిత్రోవ కాదు
నరుడె బ్రహ్మమెరుగ నారాయణుండౌను
కాళికాంబ!హంస!కాళికాంబ
మనషి పాములాగా సాటిమనిషిని కాటేయకూడదు. తోడేలులాగా పైనబడి దాడిచేయరాదు. మనిషి బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటే అతడే నారాయణుడౌతాడు అన్నారు. బ్రహ్మము అంటే సత్యం వాస్తవం వంటి అనేకార్థాలు చెప్పుకోవచ్చు. మానవుడు జ్ఞానవంతుడైతే మాధవుడౌతాడని అర్థం. మానవుడే మాధవుడని సామెత. నారాయణుడుండాడా లేడా అనేది అలా ఉంచి మనిషి దోపిడీదారుడుగా కాకుండా జ్ఞానవంతుడై మనిషిగా ఎదగాలని అనుకున్నందుకు బ్రహ్మంగారికి నమస్కరిద్దాం. దోపిడీరహిత సమాజ నిర్మాణానికి బ్రహ్మంగారి బోధనలను సైతం ఉపయోగించుకుందాం.

Leave a Comment