చదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము
కులము గోత్రములను గలుగు మదము
మానువారె దురభిమానవర్జితులిల
కాళికాంబ!హంస!కాళికాంబ
అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు ధనవంతులు కాగలుగుతారు,అనేకులు పేదలుగా మిగిలిపోతారు. కొందరికి తపస్సు చేసుకునే విశ్రాంతి ఉంటుంది. అనేకులకు తీరిక ఉండదు. పైగా అందరికీ తపస్సు హక్కు కాదు. కొందరు అందంగా పుడతారు, మరి కొందరు అలా పుట్టలేకపోతారు. కొందరు గుణవంతులౌతారు మరికొందరు గుణహీనులౌతారు. కొందరు పైకులాలలో పుడతారు మరికొందరు కింది కులాలలో పుడతారు. కొందరి గోత్రాలు గొప్పగా ఉంటాయి మరికొందరివి అలా ఉండవు. ఇవి మన సమాజంలోని వైరుధ్యాలు. ఇందుకు సాంఘిక, ఆర్థిక, జన్యు కారణాలుంటాయి. బ్రహ్మంగారు విస్త్రతంగా ప్రజల మధ్య సంచరిస్తూ ఈ వైరుధ్యాలను గమనించారు. వీటి ప్రభావాన్ని కూడా గ్రహించారు. ఈతేడాలు మనుషులలో చీలికలు తెస్తున్నాని తెలుసుకున్నారు. చదువు, ధనం, తపం, అందం, గుణం, కులం, గోత్రాలలో పైనున్నవాళ్ళలో గర్వాన్ని గుర్తించారు బ్రహ్మంగారు. పైనున్నవాళ్ళకు తమకన్నా చదువు ధనం వంటి ఏడంశాలలో కిందనున్న వాళ్ళ పట్ల చులకన భావం ఉండడం ఆయన చూశారు. ఆపొగరు మోతుతనాన్ని గర్హించారు. చదువుకోలేకపోయిన వాళ్ళను చదువుకున్నవాళ్ళు తమస్థాయికి తీసుకు రావడం అవసరం. అలాగే తక్కిన విషయాలలో కూడా. కానీ పరిస్థితి అందుకు తలకిందులుగా ఉన్నది. ఒకడు తపస్సు చేసుకోడానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించే తొమ్మిది మందికి తపస్సు చేసుకునే అవకాశం లేదు. పైగా వాళ్ళపట్ల చిన్నచూపు. ఏకారణం చేతకూడా మనిషికి మదం సహించరానిది. నేనొక్కడినే పరిశుద్ధుణ్ణి తక్కిన వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు అనుకోవడం, నేను తెల్లగా ఉన్నాను తక్కినవాళ్ళు నల్లగా ఉన్నారు,నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది తక్కినవాళ్ళంతా దరిద్రులు అనుకోవడం మదం. ఆమదం మంచి మదం కాదు. ఆమదాన్ని వదులుకున్నవాడు దురభిమానాన్ని వదులుకున్న వాడౌతాడు. అభిమానం మంచిదే గానీ దురభిమానం మంచిదికాదు. దురభిమానంతో మదంతో తలకిందులుగా పాటుపడుతున్నవాళ్ళకు మొట్టికాయ వేశారు. మదాంధులను తగ్గమని సూచించారు. వీరబ్రహ్మంగారి కన్నా ముందు అన్నమయ్య, వేమనలు ఇటువంటి ధోరణిని ఎత్తిచూపారు.
“కులమెంత గలిగెనది కూడించుగర్వంబు….ఘనవిద్యగలిగినను కప్పు పైపై మదము”అన్నారు అన్నమయ్య.”
ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మనక నెచ్చున్ “అన్నారు వేమన. వీళ్ళవరుసలో బ్రహ్మంగారు మనిషికి మదం కలిగించే ఆర్థిక సాంఘికాది అంశాలను పేర్కొని వాటికి దూరం కమ్మని హెచ్చరించారు. ఇప్పటికీ మన సమాజంలో ఆధిపత్యవర్గాల మదం కొనసాగుతున్నది. ఆధిపత్యవర్గం వాళ్ళు బ్రహ్మంగారిని చదవాలి.