ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలను ఆపాలని ఉక్కు సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతికి శుభవార్త అందిస్తామని చెప్పిన నాయకులు దాని ఊసే ఎత్తడం లేదన్నారు.  ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో భాజపా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. కర్నాటకలో 104సీట్లు సాధించినందుకు స్థానిక నాయకులు బాణాసంచా కాల్చారని.. అయితే ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చి బాణాసంచా కాల్చితే తాము పాల్గొంటామన్నారు.  ఉక్కు పరిశ్రమ సాధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. భాజపా చేస్తున్న అన్యాయాలపై కరపత్రాల ద్వారా రాయలసీమలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. చిన్నచిన్న వాటి కోసం పోట్లాడుకుంటున్న తెదేపా నాయకులు ఉక్కు పరిశ్రమను విస్మరిస్తున్నారన్నారు.  ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో 15వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 45వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుతో మరికొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే విశాఖపట్నం లాగా ప్రొద్దుటూరు పట్టణం పెద్ద పట్టణంగా మారుతుందని తెలిపారు. తెదేపా నాయకులకు పెద్దపట్టణం కావడం ఇష్టం లేన్నట్లుగా ఉందన్నారు.  ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేస్తే జన్మనిచ్చిన కన్నతల్లి రుణం తీర్చుకున్న వారవుతారని తెలిపారు.