pioneersఆత్మతత్త్వవేత్త లాదర్శవంతులై

నడువవలయు వాంఛ విడువవలయు

చూపరులకు నడత చూపుట మేలౌను

కాళికాంబ!హంస!కాళికాంబ.. .

ఆత్మతత్వాన్ని తెలిసినవారు దానిని గురించి ఏమీ తెలియని సామాన్యులకు ఆదర్శవంతులై ఉండాలి. కోరికలను విడనాడాలి. చూచేవాళ్ళకు నడత నేర్పగలిగితే మంచిది. అత్యున్నత సిద్ధాంతాలను ప్రజలముందు వల్లిస్తూ అత్యధమస్థాయి ఆచరణ గలవాళ్ళను ఎత్తిచూపడానికి బ్రహ్మంగారు ఈపద్యం చెప్పారు. మనిషికి శరీరంతో పాటు ఆత్మకూడా ఉంటుందని , శరీరం అశాశ్వతమైనదని , ఆత్మ శాశ్వతమైనదని, ఆత్మ కాలస్తే కాలదు, దానికి చెదలుపట్టదు, ఒక మనిషి మరణిస్తే ఆశరీరాన్ని వదలి మరోశరీరంలోకి ప్రవేశిస్తుందని వేదాంతులు చెబుతూ ఉంటారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమంటే వేదాంతం ప్రకారం వైజ్ఞానికంగా పరిణతదశకు చేరుకున్నట్లు లెక్క. భావవాదులు ఆత్మను నమ్ముతారు. ఆత్మజ్ఞానం , ఆత్మశాంతి, ఆత్మప్రబోధం, ఆత్మానుభవం , ఆత్మశుద్ధి, ఆత్మసాక్షి, ఆత్మసాక్షాత్కారం వంటిమాటలు ఆత్మను ఆశ్రయించి సృష్టించుకుంది సమాజం. భౌతికవాదులు ఆత్మను నమ్మరు. శరీరంలో అనేక అవయవాలున్నాయి. వాటిలో ఆత్మ ఉన్నట్టు శరీరశాస్త్రం చెప్పలేదు. మెదడు, గుండె, కన్ను , ముక్కు, ప్రేవులు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలున్నట్లుగా ఆత్మ అనేది శరీరంలో లేదు. ఇదంతా సైన్సుకు , శాస్త్రీయదృక్పథానికీ సంబంధించిన విషయం. సరే మన పూర్వికులు చెప్పినారు గనక  ఆత్మ ఉందనుకుందాం. ఆత్మ ఉన్నప్పుడు దానికొక తత్వం ఉంటుంది. అది అందరికీ తెలియదు. కొందరికే తెలుసు. ఆ తెలిసిన కొందరు మిగతావాళ్ళకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళు వైజ్ఞానికంగా ఉన్నత దశకు చేరుకున్నవాళ్ళు. వాళ్ళు ఆత్మతత్వవిదులు గనక వాళ్ళజీవితం ఆ జ్ఞానానికి అనుగుణంగా ఉండాలి. ఇతరులు వాళ్ళను అనుసరించేట్లు ఉండాలి అంటున్నారు బ్రహ్మంగారు. ఆత్మతత్వం తెలిసినవాళ్ళకు భౌతిక జీవితంపట్ల సామాన్య ప్రజల కుండే వ్యామోహం ఉండకూడదు. ఆత్మతత్వ వేత్తలు భౌతిక  సుఖలాలసులుగా ఉండకూడదు. శారీరక సౌఖ్యాలపట్ల, ఆకర్షణలపట్ల వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉండాలి. సంపద పోగేసుకోవడం , మోసంచేసి సంపాదించడం, ఆధిపత్యం చెలాయించడం, సుఖాలకు వినోదాలకు వ్యసనాలకు బానిసలు కావడం వంటి వాటికి దూరంగా ఉండాలి. అందుకే బ్రహ్మంగారు వాంఛ విడువవలయు అన్నారు. ఆత్మతత్వవేత్త చెయ్యవలసిన పని కోర్కెలను వదులుకోవడం. కానీ బ్రహ్మంగారి కాలంలో ఆత్మతత్వవేత్తలుగా ప్రచారంలో ఉన్నవాళ్ళు, తాముబోధిస్తున్నట్టుగా బ్రతకడం లేదు. మాటల్లో ఆత్మ, ఆచరణలో శరీరం. ఇది వైరుధ్యం. ఈవైరుధ్యం సమాజానికి హానిచేస్తున్నది. ప్రజలు మోసపోతున్నారు. అందుకే హెచ్చరించారు బ్రహ్మంగారు. ఆత్మవాదులు చూపరులకు నడత అంటే ఆత్మవాదానికి అనుగుణంగా బ్రతకడం నేర్పాలి అన్నారు. చెప్పేవాడు ఆత్మవాదానికి అనుగుణంగా నడచుకుంటేగదా ఇతరులను నడిపించడానికి! సిద్ధాంతానికీ ఆచరణకూ వైరుధ్యం ఉండరాదని బ్రహ్మంగారి అభిప్రాయం. ప్రజల్ని మోసంచేసే, తప్పుదారి పట్టించే సిద్ధాంతాలు వల్లించవద్దని ఆయన వారించారు. వైజ్ఞానికంగా ముందున్నవాళ్ళు ఇతరులకు  వాస్తవాలు చెప్పాలి. ఆచరించదగిన వాటినే బోధించాలి. నీతిని బోధించి అవినీతికి పాల్పడడం ప్రమాదకరం. ఇది వేదాంతులకే కాదు సమాజంలోని అన్నిరంగాలవాళ్ళకూ వర్తిస్తుంది. ఆత్మ తెలిసినవాళ్ళు ఆత్మవాదం ప్రకారం బ్రతకాలి. సైన్సు చదువుకున్నవాళ్ళు శాస్త్రీయంగా బ్రతకాలి.  కానీ అలా జరగడం లేదు. ఆత్మవాదుల ఆశ్రమాలకు ఎంతెంత సంపద ఉందో, వాళ్ళవైభవాలు ఆగడాలు ఎలా ఉంటున్నయో చూస్తున్నాం. వాంఛ విడువవలయు అన్న బ్రహ్మంగారి బోధను నేటి ఆత్మవాదులు ఆచరించి ఇతరులకు మార్గదర్శకులైతే సమాజంలో స్వార్థం తగ్గుతుంది. ఏసిద్ధాంతమైనా వాస్తవాల పునాదుల మీద నిర్మింపబడాలి. అబద్ధం మీద , అజ్ఞానంమీద, మోసం మీద సిద్ధాంతాలు నిర్మించవద్దని బ్రహ్మంగారి ప్రబోధం.