కడపలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఆయా శాఖ అధికారులకు వినతిపత్రాలను పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.  ఉపాధి కోసం వలస వెళ్లిన తన భర్త మృతితో జీవనోపాధి కష్టంగా మారిందని కలెక్టరుకు వివరించిన కడపకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు.  నిర్మించుకొన్న ఎన్టీఆర్‌ పక్కా గృహానికి బిల్లు మంజూరు చేయించాలంటూ అట్లూరుకు చెందిన లక్ష్మీదేవి కలెక్టరును అభ్యర్థించింది.  మైదుకూరుకు చెందిన జయమ్మ తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు. రామాపురం మండలం కాశినాయన చెరువు కు చెందిన నరసింహులు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరుకు అభ్యర్థించారు. చిన్నమండెం మండలం ఎస్టీకాలనీకి చెందిన ఎస్‌.  హుస్సేన్ తన రెండవ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరారు. ప్రజావాణిలో జిల్లా స్పెషల్‌ కలెక్టర్ నాగేశ్వరరావు, డిఆర్వో ఈశ్వరయ్య, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, ఐసిడిఎస్ పీడీ పద్మజ, ల్యాండ్ సర్వే ఏడీ  హనుమాన్ ప్రసాద్‌, సీపీవో  తిప్పేస్వామి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయాచారి, సైనిక సంక్షేమ అధికారి రామచంద్రారెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి ఖాదర్‌బాషా,  సూక్ష్మసేద్యం పీడీ మధుసూదన్‌రెడ్డి, మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.