పాడిపరిశ్రమతో మహిళల ఆర్థిక ప్రగతి

వార్తలు
145 Views

పాడిపరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేస్తోందని, ఆ దిశగా అమూల్ సంస్థ భాగస్వామ్యంతో మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. మంగళవారం పులివెందుల రాణితోపు సమీప కల్యాణ మండపంలో పాడా ఓఎస్డీ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య- అమూల్ సంస్థ ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ పరిధి మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటుపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. వ్యవసాయం ఒకటే మార్గం కాదని… అనుబంధ రంగాల్లోనూ మహిళలకు సరైన ప్రోత్సాహం అందించి ఆర్థికంగా వృద్ధి చేయడానికి అమూల్ సంస్థతో కలిసి మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అమలు చేయడం జరుగుతుందని, రాబోయే రోజులలో జిల్లా మొత్తం అమలు చేయనున్నారని వివరించారు. గుజరాత్, మహారాష్ట్రలలో మహిళలు పాలపై ఆధారపడి సంపాదిస్తున్నారని, అమూల్ సంస్థ వారికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోందని రాష్ట్రంలోనూ సంస్థ ద్వారా మహిళల సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పాల నాణ్యత, వెన్న శాతం తదితరాలన్నీ పారదర్శకంగా నిర్వహిస్తారని వివరించారు. అమూల్ సంస్థ నిబంధన ప్రకారం ఆవు పాలలో వెన్న మూడు శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.3 శాతం, అదే గేదెపాలలో వెన్న 6 శాతం, ఎస్ఎన్ఎఫ్ 9 శాతంగా ఉండాలని, ఆ ప్రకారం ఉన్న పాలకు మంచి ధర లభిస్తుందని వివరించారు. గ్రామాలలో గేదెలు లేని వారు ఎవరైనా ఉంటే గేదెలు కొనుగోలు చేసుకుని పాలు పోయడానికి ముందుకు వస్తే అలాంటి వారికి వైయస్సార్ చేయూత పథకం ద్వారా బ్యాంకు రుణం ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జేసి(రెవెన్యూ) ఎం.గౌతమి, జేసి (ఆసరా) పి.ధర్మచంద్రారెడ్డి, అమూల్ మహారాష్ట్ర ప్రోక్యూర్మెంట్ ఏజిఎం అనిల్ కౌట్కర్, డ్వామా, డిఆర్డీఏ పీడీలు యదుభూషన్ రెడ్డి, మురళి మనోహర్, పశుసంవర్ధక శాఖ జేడి సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *