మనసు శుద్ధమతె మరి దండమేటికి
మనసు శుద్ధమైతె మంచిదనుట
మంచిచెడ్డ లెల్ల మానసంబేకద
కాళికాంబ!హంస!కాళికాంబ
మనసు శుభ్రంగా ఉంటే ఏశిక్షవేసే అవసరం ఉండదు. మనసును నిష్కల్మషంగా పెట్టుకుంటే అంతా మంచేజరుగు తుంది. మంచైనా చెడ్డైనా అంతా మనసేకదా. బ్రహ్మంగారు ఎన్నో తాత్విక సామాజికాంశాలు చెప్పారు. అలాగే అన్నిటికీ శరీరమే నిలయం అని చెప్పారు. అలాగే ఆయన మనస్సును గురించికూడా కొన్ని టద్యాలు రాశారు. ఒక మనిషి మంచివాడో చెడ్డవాడో కావడానికి సామాజిక కారణాలుంటాయి. వ్యక్తిగత కారణాలుకూడా ఉంటాయి. వ్యక్తిగత కారణం అంటే ఆలోచనా విధానం, దాని ననుసరించిన ప్రవర్తన. ఈమధ్య పాజిటివ్ నెగటివ్ థింకింగులను గురించి మేధావులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. బ్రహ్మంగారు ఈపద్యంలో చెప్పింది వాటిని గురించే. మనసును శుద్ధిగా పెట్టుకుంటే చెడ్డపనులు చెయ్యడానికి అవకాశం ఉండదు. దానికి దండనా ఉండదు. మనసును నిష్కల్మషంగా పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. కనుక మంచిచెడ్డలు రెండూ మనసులో ఉన్నాయి అని ఆయన గుర్తుచేశారు. మనలో చాలామందికి ఉన్న జబ్బు ఆత్మోత్కర్ష పరనింద అన్నది. నేను మంచివాడిని నేను నిజాయితీ పరుణ్ణి నేను ఏతప్పూ చేయనివాడిని తక్కినవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు, అవకాశం నీతిపరులు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు అనుకునే వాళ్ళు అనేకులున్నారు. ఇది అహంభావం. ఒకడు మంచివాడైతే అది చెప్పవలసింది ఇతరులు. మనకు మనమే రొమ్ము గుద్దుకోవడం ఆత్మగౌరవానికి హాని. అలాగే ఇతరుల జీవితాలలోకి నిరంతరం తొంగిచూడడం వాళ్ళను గురించి నిరంతరం వాగుతుండడం ఒక వ్యక్తిగత రుగ్మత. ఇదే బ్రహ్మంగారుచెప్పింది. ఇలా సాటి మనుషుల గురించి లేనిపోనివి చెబుతూ ఉండడం చెప్పేవాళ్ళకు పెద్ద శిక్ష. అది ఎవరో వేసేదికాదు. నీమనసే వేస్తుంది. అందువల్ల మనసుశుద్ధి అనేది మనిషికి చాలా అవసరం. చెడు అనకు చెడువినకు అన్నారు. చెడుచేయకు అనికూడా అనాలి. చెడు చింతన లేకుంటే చెడు చేసేదే ఉండదు. శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. చేతనైతే ఒకరికి మేలు చెయ్. లేదా ఊరుకో. పనిగట్టుకొని ఎవడినో నాశనం చెయ్యాలని ప్రయత్నించకు. ఇంద్రుడు గరత్మంతుని మీదికి వజ్రాయుధం విసిరితే అది తిరిగి ఇంద్రునికే తగులుతుంది. బ్రహ్మంగారు తన సంచారంలో ఎందరో వ్యక్తులలోని కుటిలబుద్ధులను గమనించి ఇలాంటి మాటలు చెప్పి ఉంటారు. ఆత్మశుద్ధిని గురించి వేమన చెబితే బ్రహ్మంగారు మనసు శుద్ధినిగురించి చెప్పారు. ఆయన కవిత్వం కలుష మనసులను కవ్వంతో చిలికి పారేస్తాయి. ఆయనను చదివితే ఆత్మలు మనసులు ప్రక్షాళనమౌతాయి.