ysrkadapa

రాచపాలెం

రావణునకు నెపుడు రాముడు సరిగాడు

రావణునకు నెపుడు రాముడు సరిగాడు
రావణునకు మిగుల రంకువచ్చె
సీత నరిమిపట్ట చేటు లంకకు వచ్చె
కాళికాంబ!హంస!కాళికాంబ!
శ్రీరాముడు ఎప్పుడూ రావణునితో సమానం కాదు. అయితే రావణుడు సీతను అపహరించి నిర్బంధించడం వల్ల అతనికి రంకుతనం అంటుకుంది. అంతేకాదు రావణుని రాజ్యమైన లంకకు చేటు తెచ్చింది. బ్రహ్మంగారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెండు భారతీయ పౌరాణిక పాత్రలను తీసుకొని వాటి వ్యక్తిత్వాలను, వాటిలోని భేదసాదృశ్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి , వాటి పరిణామాలను చెప్పారు. బ్రహ్మంగారు రామాయణపరంగా కొన్ని పద్యాలు రాశారు. ఈపద్యం వాటిలో ఒకటి. ఇది రామాయణాన్ని పూజించడానికీ త్యజించడానికీ సంబంధించినది కాదు. ఆర్యద్రావిడ వాదానికి చెందిన విషయమూ కాదు. ఉత్తరదక్షిణ భారత భూభాగ వివాద విషయమూ కాదు. దైవరాక్షసభేదాలకు చెందిన అంశమూ కాదు. కేవలం వ్యక్తిత్వం, అందులోని లోపం, దాని దుష్పరిణామం .. వీటికి మాత్రమే సంబంధించిన పద్యమిది. రాముడు, రావణుడు మనందరికీ తెలిసిన పాత్రలు. ఈ రెండు రాచరిక వ్యవస్థకు నాయకత్వం వహించిన పాత్రలే. వీటి పట్ల మనందరికీ ఒకే అభిప్రాయం లేదని కూడా మనకు తెలుసు. బ్రహ్మంగారికి కూడా ఈ రెండు పాత్రల పట్ల తనదైన అభిప్రాయముంది. రావణునకు నెప్పుడు రాముడు సరిగాడు అన్నది ఆయన అభిప్రాయం. ఈ అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉండడం సహజమే. అయితే బ్రహ్మంగారు చెప్పదలచుకున్నది రాముని కన్నా అనేక విధాలుగా పైనున్న రావణుడు తన వ్యక్తిత్వంలోని లోపం వల్ల ఎలా పతనమయ్యాడో చూడండి అని హెచ్చరిక చేయడమే. అదికూడా స్త్రీ విషయంగా మొగవాడు పాడితప్పి నడిస్తే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో చూడమని ఆయన హెచ్చరించారు. సీతా రామలక్ష్మణులు వనవాసంలో ఉంటారు. రామలక్ష్మణులు ఇంటిపట్టున లేరు. ఒంటరిగా ఉన్న సీతని మారురూపంలో వచ్చి ,ఆమెను లక్ష్మణరేఖను దాటించి, అపహరించుకొని లంకలో పెట్టాడు. బ్రహ్మంగారు ఈ దౌర్జన్యాన్ని ఖండించారు. సీత రాముని భార్య. రావణుడు మండోదరికి భర్త. ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. రాముడు అయోధ్యకు పాలకుడు కావలిసిన వాడు. కుటుంబ రాజకీయం అందుకు అడ్డు పడింది. అయినా ఆయనపాదుకలు సింహాసనం మీద పెట్టే భరతుడు పాలన చేస్తున్నాడు. రావణుడు లంకాధీశుడు. వీళ్ళలో ఎవరి గుణాలు వాళ్ళకున్నాయి. ఎవరిశక్తి సామర్థ్యాలు వాళ్ళకున్నాయి. ఇందులో రావణుడే గొప్పవాడని బ్రహ్మంగారి అభిప్రాయం. రావణుడు కశ్యపబ్రహ్మ మనుమడు. క్షాత్రశక్తితో రాజ్యాధికారం సంపాదించాడు. లంకకు అధిపతి అయ్యాడు. కానీ అతని శీలంలోని లోపం స్త్రీని అపహరిం చడం. నిర్బంధించడం. స్త్రీవిషయంలో అతడు తప్పుటడుగు వేశాడు. దానివల్ల వ్యక్తిగతంగా అపకీర్తి తెచ్చుకున్నాడు. రాజు గనక రాజ్యమూ ధ్వంసమైంది. స్త్రీకి ఉన్నతాసనం వేసే బ్రహ్మంగారు రావణుని చర్యను ఉపేక్షించకుండా ఎత్తి చూపి తనకాలం సమాజాన్ని హెచ్చరించారు.

పాశ్చ్యాత్య సౌందర్య శాస్త్రపితామహుడు అరిస్టాటిల్ .ఆయన నాటకాన్ని ట్రాజడీ (విషాదము) కామెడీ(తోషదము) అని విభజించి లక్షణాలు చెప్పాడు. విషాదనాటక నాయకుడు కీర్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు అయి ఉంటాడు. అన్నీ సుగుణాలు ఉంటాయి. కానీ విచక్షణారాహిత్యంవల్లనో, శీలంలోని లోపంవల్లనో విపత్తును కొని తెచ్చుకుంటాడు. సరిగ్గా రావణుడు ఈలోపాలవల్ల పతనమయ్యాడు. నాయకులారా జాగ్రత్త అని హెచ్చరించారు బ్రహ్మంగారు. ఈ హెచ్చరిక ఈనాటికీ వర్తిస్తుంది. నేటి మహిళలు మృగాళ్ళ’వల్ల నిత్యమూ నిరంతరమూ హింస భరిస్తూనే ఉన్నారు. మన సమాజంలో స్త్రీ అవమానింపబడుతున్నంతకాలం , హత్యింపబడుతున్నంతకాలం వీరబ్రహ్మంగారి హెచ్చరిక చూపుడు వేలు చూపుతూనే ఉంటుంది.

Leave a Comment