ysrkadapa

వార్తలు

రాయచోటి వీరభద్రుడు

దక్షిణ కాశీగా పేరొందిన రాయచోటి వీరభద్రాలయం 8వ శతాబ్ధం చోళ రాజులు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్ధంలో కాకతీయ గణపతి దేవుడు ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన గర్భగుడి 14వ శతాబ్ధంలో సదాశివరాయలు జీర్ధోరణ చేసినట్లు ఆలయంలోని శిలా సంపద ఆధారంగా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర రాజుల పాలనలోను ఆలయ ఆలనా పాలన కొనసాగిందని ఈ ఆలయ ప్రత్యేకతలను బట్టి తెలుస్తోంది. రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దక్షిణాధి రాష్ట్రాల భక్తులకు ఇలవేల్పుగా కొలువై నిత్య పూజలు అందుకొంటూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోవెల అలరారుతోంది.

భద్రకాళీశ్వరుడు ఎలా ఉద్భవించారంటే : వీరభద్రుడి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. శివ ద్వేశంతో ధ]క్షప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి భర్తమాట కాదని సతీదేవి హాజరైంది. కుమార్తె అయినా సతీదేవిని ధక్షుడు అవమానపరిచారు. భరించలేక సతీదేవి యజ్ఞశాలలోని అగ్నిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అది తెలిసి మహోద్రుగ్దుడైన శివుడు తన శిరస్సుపై ఉన్న ఒక జటను పెరిగి కిందకు విసిరితే అందులో నుంచి ప్రళయ బీకరాకార వీరభద్రుడు ఉద్భవించారని చరిత్ర చెబుతోంది. రుద్రగణ సహితుడై యజ్ఞశాలపై విరుచుకుపడి ఆ యాగానికి వచ్చిన దేవతలను దండించి ధ]క్షుని శిరస్సును తన ఖడ్గంతో ఖండించి అగ్నికి ఆహుతి ఇచ్చారు. వీరభద్రుడు సృష్టించిన బీభత్సానికి శివుడు సంతోషించారు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకుని వీరులకు వీరేశ్వరుడువై వర్ధిల్లుగాక అని దీవించారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. వీరత్వానికి ప్రతీక అయిన వీరభద్రుడు పవిత్ర మాండవ్య మహాముని తపోశక్తితో పరమపవిత్రమైన రాయచోటి సమీపంలోని మాండవ్యనది ఒడ్డున భద్రకాళీ సమేతుడై విగ్రహ మూర్తిగా కొలువై నిలిచారు. నిలువెల్లా మనస్సు పెట్టి ప్రార్థించే భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కోవెలగా నేటికి వీరభద్రాలయం విరాజిల్లుతోంది.

ఉప ఆలయాల చరిత్ర ఘనమే : రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో వీరభడ్రుడు, భద్రకాళీదేవి ప్రధాన ఆలయాలకు ఉపఆలయాలు అనేకం ఉన్నాయి. ఆలయ ఆవరణంలో అఘోర లింగేశ్వరుడు కొలువై ఉన్నారు. అనుబంధంగానే వామలింగేశ్వర, మరో శివ లింగాలు ప్రతిష్టించారు. శివుడికి కుడి, ఎడమలుగానే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు వెలిశాయి. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. బసవేశ్వరుడి ఆలయం, నవగ్రహ మండపం, నాగదేవత, అరుదైన కాలభైరవస్వామి ఆలయాలు వెలిశాయి. ఆలయం జీనోర్ధరణకు ముందుగానే ఏలుబడిలో ఉన్న గ్రామ దేవత యల్లమ్మ ప్రధాన గర్భగుడిలోనే కొలువైంది. ఆలయం ప్రధాన ముఖద్వారం ఎదుట మహానందీశ్వరాలయం నెలకొంది. వీరభద్రాలయం ముఖ ద్వారంలోనే ఐదు అడుగుల ఎత్తైన నందికేశ్వర, మహాకాళీశ్వర ద్వారపాలకులు ఖడ్గాలు ధరించి స్వామివారి ముఖ ద్వారాన్ని కాపు కాస్తుంటారు.
కన్నడ, మరాఠీల ఇలవేల్పు వీరేశ్వరుడు : రాయచోటిలో వెలిసిన వీరభద్రుడు దక్షిణ భారతదేశంలో శ్రీశైలం తర్వాత స్థానం దక్కించుకున్నారు. ఇక్కడి విగ్రహమూర్తి తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, మరాఠీ, తమిళలకు ఇలవేల్పుగా ఉన్నారు. ఆలయానికి వచ్చే భక్తులలో అధిక శాతం మంది ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వీరశైవులే ఎక్కువగా  ఉంటారు.

మహానైవేద్యం విశిష్టత : బ్రహ్మోత్సవాల వేళ మహానైవేద్య (అన్నకూటోత్సవం) ఘట్టం నిర్వహిస్తారు. రోజుకు 5 పావు చొప్పున 365 రోజులకు లెక్కించి నైవేద్యం తయారు చేసి రాసిపోస్తారు. ఆలయ నిర్మాణంలో నైపుణ్యతను ప్రదర్శించిన వడియ రాజులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి తొలి ప్రసాదం స్వీకరిస్తారు. తర్వాత స్వామివారి మూడో నేత్ర దృష్టి ప్రసాదంపై పడి ఆరగించిన వెంటనే కుప్పగా ఉన్న అన్నప్రసాదం పలుచబడి మెత్తగా తయారవుతుంది. ప్రసాదం పొందేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనెల 18 తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం కాగానే మధ్యాహ్నం 11.45 గంటలకు నైవేద్య ఘట్టం నిర్వహిస్తారు.
ః రాయచోటి పురంలో ఉన్న మైనార్టీల మనస్సును వీరభద్రుడు గెలుచుకున్నారని పురాణి ఇతిహాసాలు చెపుతున్నాయి. మైనార్టీల (దేశ్‌ముఖ్‌)ల ఇంట బాలుడిగా ఉంటూ పశువుల కాపరిగా ఉండే వారని నేటికి హిందు-ముస్లిం మతసామర్యాన్ని చాటుతూ బ్రహ్మాత్సవం, ఉగాది పర్వదినాలలో స్వామివారి ప్రసాదానికి బియ్యం, బెల్లం, బేడలు ఇవ్వడం ఆనవాయితీ కొనసాగుతోంది.

Leave a Comment