ysrkadapa

వార్తలు

వినయం వల్లే చదువు

చదువకొన్నఫలము కుదరైన వినయమ్ము
వినయఫలము వేదవేది యగుట
వేదవేదిఫలము విశ్వమ్ము తానౌట
కాళికాంబ!హంస!కాళికాంబ

చదువు వలన ఫలితం మనిషిలో వినయం కలగడం,  వినయం వలన ఫలితం వేదవేది కావడం,  వేదవేది కావడం వలన ఫలితం విశ్వమే తాను కావడం. ఈపద్యంలో బ్రహ్మంగారు చదువు, దాని ప్రయోజనం, దాని పరిణామం క్లుప్తంగా తెలియజేశారు. ఒకదేశం గొప్పతనాన్ని నిర్ణయించే అంశాలలో ఆదేశంలో విద్యావంతుల సంఖ్య ముఖ్యమైనది. 17వ శతాబ్దంలో మనదేశంలో విద్యావంతుల సంఖ్య అత్యల్పం. వాళ్ళు ఎవరు అనేది అందరికీ తెలిసిన అంశమే. పైగా అప్పటికి విద్యలో నేడున్నంత విషయ వైవిధ్యం లేదు. వేదోపనిషత్తులు పురాణేతిహాసాలు చదువుకున్నవారికే గౌరవం ఎక్కువ. బ్రహ్మంగారికి వేదంపైన అపారమైన గౌరవముంది. వేదాలను గురించి ఆయన ఆరేడు పద్యాలు రాశారు. చదువు సమాజ పునర్నిర్మాణానికి అవసరమైన పౌరశక్తిని ఉత్పత్తి చేస్తుంది.  ఇది భౌతిక ప్రయోజనం. దానికి మరో ఫలితం కూడా ఉంది. అది మనిషిలో వినయం అనే గుణాన్ని పెంచడం. వ్యక్తిత్వ వికాసమంటే ఇదే. కులంచేత, ధనంచేత, రూపంచేత, గోత్రంచేత ఇంకా అనేక అంశాలచేత మనిషిలో  అహంకారం గూడుకట్టుకొని ఉంటుంది. మదం బలిసి ఉంటుంది. అహంకారం సద్గుణం కాదు దుర్గుణం. సమాజం దుర్గుణవంతుల బంతులతో నిండిపోతే ఆసమాజం బాగుపడదు. దానికి విరుగుడు చదువు అని బ్రహ్మంగారి తీర్పు. చదువు రోగనివారిణి ఆయనదృష్టిలో. చదవు మనిషిలో వినయం కలిగిస్తుంది కాబట్టి మనిషి కుల ధనాదుల వల్ల సంక్రమించిన అహంకారం అనే జబ్బునుంచి బయటపడతాడని ఆయన అభిప్రాయపడ్డారు. పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేవాళ్ళు వెనకటి రోజులలో. బ్రహ్మంగారు విద్యను పరష్కారంగా భావించారు. విద్యావంతుల సంఖ్య పెరిగితే వాళ్ళంతా వినయశీలురైతే సంఘం నాగరికం, మానవీయం అవుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను నాగరికంగా పరిష్కరించుకోడానికి వీలవుతుంది.  మనుషుల్ని అర్థం చేసుకొని సామరస్యంగా బతకడానికి వీలవుతుంది. చదువు వల్ల వినయం ఫలితమైతే వినయంవల్ల మనిషి వేదవేది అవుతాడన్నారు బ్రహ్మంగారు. అంటే చదవువల్ల వినయం,  వినయంవల్ల చదువు సిద్ధీస్తాయన్నమాట. వేదవేది అంటే వేదవిద్యలో ఆరతేరిన వ్యక్తి. వేదం అంటే ఏమిటో తెలిసినవారు. జ్ఞానానికీ శీల నిర్మాణానికీ గల అవినాభావ సంబంధాన్ని గుర్తించారు బ్రహ్మంగారు.  వేదవేది అయిన వ్యక్తి విశ్వమే తానౌతాడు అన్నారు బ్రహ్మంగారు. అంటే మొత్తం సమాజం మీద ప్రభావం చూపించగలడని అర్థం. అంటే ఒక దీపం అనేక దీపాలను వెలిగించినట్లు ఒక విద్యావంతుడు అనేక మంది విద్యావంతులను ఉత్పత్తి చేస్తాడు. అలాంటి విద్యకూడా మనిషిలో గర్వం పెంచిందనుకోండి. ఇక ఈసమాజానికి దిక్కుండదు. అందువల్ల చదవు మనిషిలో వినయాన్నే పెంచాలి. కుల ధనాది భౌతికాంశాల వల్ల కలిగిన గర్వానికి విద్యాగర్వం తోడైతే చాలా ప్రమాదం. 17వ శతాబ్దంనాటికి ప్రాచుర్యంలో ఉన్న వేదవిద్యను దృష్టిలో ఉంచుకొని బ్రహ్మంగారు ఇలాచెప్పారు. ఇవాళ  మానవీయ, సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలుగా విభజింపబడి ఉన్న విద్యావ్యవస్థకు కూడా బ్రహ్మంగారి ప్రబోధం వర్తిస్తుంది.  బ్రహ్మంగారికి ముందు కూడా ఇలాంటి ప్రబోధాలు ఉన్నాయి. వాటిసారాన్ని బ్రహ్మంగారు తనకాలపు సమాజ నేపథ్యంలో  తనమార్గంలో అందించారు. చదువు ఫలితం మనిషి నిగర్వికావడమే. సంస్కారవంతుడవడమే.

Leave a Comment