భూసమస్యల పరిష్కారానికి జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి జులై 5 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలను విజయవంతం చేయాలని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు కోరారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి రెవిన్యూ గ్రామసభల నిర్వహణపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో జేసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ…. గ్రామాలు, మండలాల్లో చుక్కల భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా 6 అంశాలపై రెవిన్యూ గ్రామసభలలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని తెలిపారు. చుక్కల భూములు, మ్యుటేషన్స్, అర్బన్ ల్యాండ్ రెగ్యులరైజేషన్స్, రైతు సొసైటీ గ్రూపులకు గతంలో ఇచ్చిన భూములు, సాగు చేస్తున్న అర్హులైన వారికి పట్టాలు రూపొందించడం, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా అటవీ సాగు భూములను రైతులకు పట్టాలు ఇవ్వడం వాటిపై అర్జీలు తీసుకోవాలన్నారు. గ్రామాలు తక్కువగా ఉన్న మండలాల్లో రోజుకు ఒక రెవిన్యూ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయాలని, ఎక్కువ గ్రామాలు ఉంటే రోజుకు రెండు, ఇంకా ఎక్కువగా ఉంటే తహసీల్దారు,  ఉప తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేసుకొని గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. గ్రామ సభల పర్యవేక్షణకు నియోజకవర్గ వారీగా 10 మంది డిప్యూటీ కలెక్టర్లను  కలెక్టర్ నియమించడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలలో భూముల అంశాలపై తప్ప ఇతర వాటిపై అర్జీలు స్వీకరించరని, ఈ విషయంపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్వో ఈశ్వరయ్య, కలెక్టరేట్ ఏఓ రమణ, సూపరింటెండెంట్ జయరాం తదతరులు పాల్గొన్నారు.