నిస్వార్థ ప్రజాసేవకుడు

రాజకీయం
1,505 Views

నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవ‌లో గ‌డిపిన మ‌హోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వర‌రెడ్డి. రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి. 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జ‌న్మించిన ఈశ్వర‌రెడ్డి నేటి త‌రానికి ఆద‌ర్శం.

1936లో డిగ్రీ పూర్తి చేసిన ఈశ్వర‌రెడ్డి గ్రామంలోని  విద్యాధిక యువకులతో కలిసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరుస‌ల్పారు. భూస్వామ్య పెత్తందారుల‌కు వ్యతిరేకంగా పావులు క‌దిపారు. ”మిత్రమండలి” ఏర్పాటు చేసి తద్వారా తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. 1938లో జిల్లా కాంగ్రెస్‌ కమిటి సభ్యుడిగా ఉండి మితవాద విధానాలతో విరక్తి చెంది కొంత‌కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ‘ఇటువల పాడు’ కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల ప్రేరణతో సమరయోధులు టేకూరు సుబ్బారావు ప్రోద్బలంతో కమ్యూనిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. కడపజిల్లాలో ఆకాశవాణి కేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లా కేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఈశ్వరరెడ్డి కృషి చేశారు. పార్లమెంటు డిబేట్స్‌ను గ్రంథస్తం చేయించి, జిల్లా గ్రంథాలయానికి సమర్పించి, భావితరాలకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కృషి చేశారు. 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులో మృతి చెందగా, ఈశ్వరరెడ్డి ప్రజాసేవ గుర్తించిన ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి ( గండికోట) ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ప్రాజెక్టుగా నామకరణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *