Tuesday, March 19, 2024

శివయే సృష్టికి మూలం

శివుడు శక్తిగూడి సృష్టికార్యమొనర్చు
శివను వీడ సృష్టి చేయలేడు
శివునికంటె శివయె సృష్టికి మూలమ్ము
కాళికాంబ! హంస!కాళికాంబ!

శివుడు శక్తితో కలసి సృష్టికార్యం నిర్వహిస్తాడు. శివను వదిలి ఆయన ఆపని చేయలేడు. అందువల్ల శివుని కన్నా శివయే సృష్టికి మూలం. శివుడు అంటేఅందరికీ తెలుసు. శివ అన్నా శక్తి అన్నా పార్వతి. శివపార్వతులు పౌరాణిక దంపతులు. ఈజంటను  ఉపయోగించుకొని బ్రహ్మంగారు  సమాజంలో స్త్రీప్రాధాన్యాన్ని చెప్పారు. పురాణాలు ప్రకృతి పురుషుల సమాగమం వల్ల సృష్టి విస్తరించిందని చెబుతాయి. మొత్తం మీద స్త్రీపురుషులు ఇద్దరి వలన ప్రపంచం విస్తరిస్తున్నదని పూర్వికులే గుర్తించారు. బ్రహ్మంగారు కూడా ఈవిషయాన్నే చెప్పారు. అయితే ఆయన అదనంగా కొంత చెప్పారు. శివుడు పార్వతి దేవుళ్ళయినా వారు స్త్రీపురుషులే. పురుషుడు స్త్రీని కలసి సంతానాన్ని సృష్టిస్తాడు. స్త్రీ లేకుండా పురుషుడు సంతానాన్ని ఉత్పత్తి చేయలేడు. అందువల్ల పురుషునికన్నా స్త్రీయే సృష్టికి మూలమౌతుందని బ్రహ్మంగారి అభిప్రాయం. క్షేత్రం బీజం అని సంప్రదాయం రెండుపదాలను వాడుతూ ఉంటుంది. క్షేత్రం స్త్రీ ,బీజం పురుషుడు. నిజానికి ఈఇద్దరిలో ఎవరు లేకపోయినా సృష్టిజరగదు.  ఇదిబ్రహ్మంగారికి కూడా తెలుసు. అయితే ఆయన స్త్రీకి ఎందుకు ప్రాముఖ్యం ఇచ్చాడంటే పురుషాధిపత్య వ్యవస్థలో పురుషుడి ఆధిపత్యాన్ని పురుషుని అహంకారాన్ని  స్త్రీపట్ల పురుషునికిగల చులకన భావాన్ని విమర్శించి పురుషునిలో మార్పు తీసుకొని రావడానికి. బ్రహ్మంగారి కాలానికే పురుషాధిపత్యం బలిసిపోయి స్త్రీని బానిసగా  చూడడం ఎక్కువైంది. ఆ అజ్ఞానాన్ని రూపుమాపి స్త్రీని గౌరవించే సమాజాన్ని నిర్మించాలన్న ఆకాంక్షతో బ్రహ్మంగారు ఈపద్యం రాశారు. ఇప్పుడు స్త్రీపురుష సమానత్వాన్నిగురించి మాట్లాడడం వింత కాదు. 17వ శతాబ్దంలో సకలరకాల ఆధిపత్యాలు, సకలరకాల మౌఢ్యాలు రాజ్యమేలుతూన్న కాలంలో ఇలాంటి పద్యం రాయడం విశేషం. ఇప్పటికీ స్త్రీలంటే చులకన భావం ఉన్నవాళ్ళకు కొదవ లేదు. వాళ్ళు బ్రహ్మంగారిని చదవాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular