ఐక్యమత్యంగా బతకాలి

రాచపాలెం
362 Views

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డిసర్వమతములందు సారమ్ము గ్రహియించి

ఐకమత్యమార్గ మనుసరించి

క్రించుదనము మాని ప్రేమించుకొనమేలు

కాళికాంబ!హంస!కాళికాంబ….

ఇటీవల సామాజిక మాధ్యమాలలో  విభిన్నకులాలవాళ్ళు తమ కులాల గొప్పతనాల్ని గురించి సభలుపెట్టి పూనకం వచ్చినట్లు చెప్పుకున్నారు. మతవాదులైతే తమమతాల గొప్పదనాల్ని చెప్పుకోవడమే కాదు ఎదురుమతాల్ని తీసిపారేస్తూ మట్లాడారు. ఎవరు దేనిద్వారా లాభం పొందుతారో వారు దానిని పొగడడం సహజం. తాము లాభం పొందిన దానికి భిన్నమైన వాటిని నిందించడమూ సహజం. ఈ పొగడ్త తెగడ్తల మధ్య సమాజం ఏమౌతుందో వీళ్ళు ఆలోచించడం లేదు. కానీ మూడువందల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు ఆలోచించారు. సమాజంలో అనేక మతాలున్నప్పుడు విజ్ఞులైనవాళ్ళు చేయవలసింది  అన్నిమతాలసారాన్ని  స్వీకరించి అందరూ ఐకమత్యంగా బతికేమార్గాన్ని అనుసరించాలి. నీచత్వాన్ని మానుకొని అన్నిమతాలవాళ్ళూ పరస్పరం ప్రేమించుకోవాలి. అదే మేలైన పని. ఇదీ బ్రహ్మంగారు చెప్పింది. మతాలు మనుషులకు కైపెక్కించి సామాజిక సామరస్యాన్ని చెడగొట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. సామాజిక విభాగాలలో ఎక్కువ తక్కువలను ఆయన ఆమోదించలేదు. అనేక కారణాలచేత  అనేక మతాలు ఏర్పడి అవి ప్రజల మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీయడంపట్ల ఆరన ఆవేదన చెందారు. మతవాదుల తీరుతెన్నులను గమనించారు. మతం మత్తు కలిగిస్తున్నదని గ్రహించారు. సమాజానికి నష్టం చేస్తున్నదేనినీ ఉపేక్షించరాదనుకున్నారు. “మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు,హితముగూర్పవలయు నెల్లరకును , హితముగూర్పలేని మతము మానగవలె”అని నినదించారు. కులవ్యవస్థలో ఎక్కువ తక్కువలను మతవ్యవస్థలో సంఘర్షణాత్మకతను బ్రహ్మంగారు నిర్విద్దంగా తిరస్కరించారు. భావవాదంలోంచి పుట్టిన మతాలు భౌతిక సమాజం మీద ఆధిపత్యం సంపాదించి ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని ధ్వంసం చేస్తున్నదశలో ఆయన గళం విప్పారు. ఇతరేతర కారణాలచేత ఏర్పడిన అనేక మతాలలోని సారాంశాన్ని అర్థం చేసుకొని ప్రజలు ఐకమత్యంగా బతకండి అని బోధించారు. అంతేకాదు క్రించుదనం అంటే నీచత్వాన్ని అంటే నేను గొప్ప అవతలివాడు దిబ్బ అనేధోరణిని మానేసి  పరస్పరం ప్రేమించుకుంటూ బతకండి అని బోధించారు. సమాజం ద్వేషాగ్నిలో కాలిపోతున్నప్పుడు ప్రేమామృతం కురిపించారు. మనం ఎంత ఆధునికులమైనా  ఎక్కువమంది సాంస్కృతికంగా మధ్యయుగాల భావజాలం నుండి బయటపడలేదు గనక  ఆసంస్కృతిని స్వయంగా చూచిన బ్రహ్మంగారిని చదువుకుంటే ప్రయోజనం ఉంది.   కందుకూరిగురజాడ, అప్పారావుగార్ల కాలానికి  బ్రహ్మంగారి రచనలు వెలుగులోకి రాలేదు. కానీ ప్రచారంలో ఉన్నాయి. వారి భావాలకు మూలాలు ఈయనలోనూ వేమనలోనూ ఉన్నాయి.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *