ysrkadapa

రాచపాలెం

సామాజిక సామరస్యం

మాటలకును మారుమాటలు పల్కుట

నోటితీటగాని బాటగాదు

వాదముడుగు వాడె నీదరి చేరును

కాళికాంబ!హంస!కాళికాంబ….

ఏకారణం చేతనైనాగాని ఇద్దరు వ్యక్తుల మధ్యగానీ రెండు సమూహాల మధ్యగానీ వివాదమేర్పడినప్పుడు విజ్ఞుడు ఎలా ప్రవర్తించాలో బ్రహ్మంగారు ఈపద్యంలో చెప్పారు. వివాదం ఏర్పడినప్పుడు దానిని పరిష్కరించుకోడానికి ప్రజాస్వామిక నాగరిక పద్ధతులుంటాయి.  వాటిమీద విశ్వాసం లేనివాళ్ళు  అవతలివాళ్ళ మీదికి అనాగరికంగా తిట్లకు పూనుకుంటారు. నోటికొచ్చింది మాట్లాడతారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసభ్యంగా మాటలు వదులుతారు. అప్పుడు  అవతలివాళ్ళు ఏమిచేయాలి అన్న ప్రశ్న వస్తుంది. సాధారణంగా అయితే వాళ్ళుకూడా తిట్లపురాణం చదవాలి. నువ్వెంత అంటే నువ్వెంత అని గోచీలు ఎగగట్టాలి. త్వంశుంఠః అంటే త్వం శుంఠః అనాలి. ఫలితం ఏమిటి? సామాజిక సంస్కారం ధ్వంసం కావడమే. అందువల్ల బ్రహ్మంగారు ఏమి చెబుతారంటే ఒకరు ఒకమాటంటే ఇంకొకరు ఇంకొక మాటంటే నోటితీట తీరడం తప్ప మరో ప్రయోజనం లేదు , సమస్య పరిష్కారంకాదు అంటారు. బాటకాదు అంటే  ఒకరు ఏదో అన్నారని ఇంకొకరు కూడా ఏదో అనడానికి పూనుకోవద్దు అన్నది బ్రహ్మంగారి ప్రబోధం. అయితే ఒకరు నన్ను నిందిస్తూ ఉంటే వింటూ ఊరికే ఉండమంటావా  మేమేమన్నా గాజులు తొడుక్కున్నామా (ఇవేగదా మనకు అలవాటైనమాటలు) అనిపించవచ్చు. అందుకు బ్రహ్మంగారు ఏమి చెప్పారంటే ఒకరు ఏమి అన్నా ఎన్నిఅన్నా అన్నీవిను ఊరికే ఉండు మారుతిట్లు తిట్టవద్దు. వాదముడుగు అంటే ఆవ్యక్తి మాటలకు స్పందించవద్దు. అలా చేస్తే మిమ్మల్ని నిందించే వాళ్ళు మాట్లాడి మాట్లాడి ఇక లాభంలేదనుకొని మీదగ్గరికే వస్తారు అంటారు బ్రహ్మంగారు. రెండు చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. ఒకచెయ్యితో శబ్దం చెయ్యలేము.  మిమ్మల్ని నిందించేవారు ఎంతగా రెచ్చగొట్టినా మీరు మౌనంగా ఉండిపోతే  తిట్టితిట్టి విసుగు వచ్చి ఒక్కోసారి ఆత్మవిమర్శలో పడవచ్చు.అవతలివాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఆలోచించుకోవచ్చు. తామేమైనా అనవసరంగా వాదానికి దిగి నిష్కారణంగా నిందిస్తున్నామా అని ఆలోచించుకొని తమ ప్రవర్తనను మార్చుకోవచ్చు అన్నది బ్రహ్మంగారి  అభిప్రాయం.

వేమన కూడా

“చంపదగినయట్టి శత్రువు తనచేత

చిక్కెనేని కీడు సేయరాదు

పొసగమేలు చేసి పొమ్మనుటే చావు

విశ్వదాభిరామ!వినురవేమ” అన్నారు. మూడువందలేళ్ళక్రితం వాళ్ళు దేశసంచారం చేస్తూ ప్రజల వ్యవహార తీరుతెన్నులను గమనించి ఆవేశాలను సంఘర్షణలను తగ్గించి సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి  ఇలాంటిభావాలు ప్రచారం చేశారు.

తిక్కనవంటి మహాకవి

“పగ యడంగునే పగన్”,

“వాక్పారుష్యము చన్నె” వంటిమాటలు  చెప్పించారు తనపాత్రలతో.  విజ్ఞతగలవారి సహనం వారి మౌనం నిందాశిల్పపారగులను కదలిస్తుంది,ఆలోచింపజేస్తుంది. నిజమే నిష్కారణంగా ఒకరు నిందిస్తూఉంటే బాధ కలుగు తుంది. కోపమూ వస్తుంది. కోపం కలిగినప్పుడు అయిదు లెక్కించమన్నారు పూర్వికులు.  కంటికి కన్ను పంటికి పన్ను అనే వాదం కూడా ఉంది. బ్రహ్మంగారి మార్గం అదికాదు. మన సంస్కారంతో అవతలివాళ్ళ సంస్కారాన్ని సంస్కరించవచ్చు అన్నది ఆయనసిద్ధాంతం.

“పరులదిట్ట నోరు పాపపంకిలమౌను

పెద్దలను నుతింప  సుద్దియగును

నోటిమంచితనము పాటించు సుజ్ఞాని

కాళికాంబ!హంస!కాళికాంబ…….

Leave a Comment