ప్రజల సమస్యల పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీహరి కిరణ్ అన్నారు.  శనివారం కడపలోని మీకోసం హాలులో ఎస్సీ ఎస్టీల ప్రత్యేక వినతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వస్తూ ఉంటారని, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామానికి చెందిన సోమ్లానాయక్‌ సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. కడప పట్టణానికి చెందిన శాంత రేషన్‌కార్డు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.  చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్‌కు చెందిన దేవభూషన్‌ చర్చి నిర్మాణం కోసం మంజూరు కోరుతూ దరఖాస్తు సమర్పించారు. బీమఠం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన ప్రశాంత్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని  పునరుద్ధరించాలని కోరారు. దువ్వూరు మండలం చింతకుంట గ్రామ నివాసి ఓబులేసు తన చెల్లెలుకు చంద్రన్న కానుకను మంజూరు చేయించాలని అభ్యర్థించారు.  పుల్లంపేట మండలం లక్ష్మీనారాయణపురం  గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య తమ గ్రామానికి విద్యుత్త సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రజావాణిలో జేసీ నాగేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఈశ్వరయ్య, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, సీపీవో తిప్పేస్వామి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల  సహాయ సంచాలకులు హనుమాన్ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్  ఈడీ శ్రీలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు