స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌-2018లో భాగంగా స్వచ్ఛత పాటించాల్సిన ఆవశ్యకతపై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌ – 2018 ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ 2018 అంశంపై సెప్టెంబరు 30వ తేదీ వరకు ప్రచార రథం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూడు ప్రచార రథాలను, అందులో పెద్ద టీవీలు ఏర్పాటు చేశామని, ఇవి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటించి ప్రజలు స్వచ్ఛత పాటించాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తాయన్నారు. టీవీల ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛతపై జిల్లాల్లో సర్వే జరుగుతుందని ఇది ప్రపంచంలో అతిపెద్ద సర్వే అని పేర్కొన్నారు. సర్వే ఆధారంగా గ్రామాలు, మండలాలు, జిల్లాకు ర్యాంక్ ఇస్తారన్నారు. గ్రామాలు, మండలాలలోని ప్రజలు స్వచ్ఛతను పాటించాలని, సర్వేలో పాల్గొనాలని కోరారు. స్వచ్ఛతను పాటించడం ద్వారా దేశంలోనే జిల్లాకు ప్రథమ ర్యాంకు వచ్చేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపిఓ మోహనరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ పర్వతరెడ్డి, డీఈఈ రవీంద్రకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.