మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలో స్వచ్ఛ సర్వేక్షన్  అవార్డు అందుకున్న జిల్లా కలెక్టరు హరికిరణ్‌ను సోమవారం జిల్లా అధికారులు సత్కరించారు. సోమవారం మీకోసం హాలులో ప్రజావాణి నిర్వహించేందుకు వచ్చిన కలెక్టరు జేసీ నాగేశ్వరావు, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటి యాజమాన్య సంస్థ పీడీలు రామచంద్రారెడ్డి, హరిహరనాథ్‌తోపాటు ఇతర అధికారులు కలెక్టరుకు శాలువాను కప్పి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీ పరిశుభ్రత, పారిశుద్ధ్య అంశాలలో దేశంలో మొదటిస్థానంలో ఉందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో ఇండోర్ సిటీని ఆదర్శంగా తీసుకొని జిల్లాను స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్లాలన్నారు. పని చేయడం ఒక ఎత్తు. చేసిన పనికి గుర్తింపు రావడం మరొకఎత్తు. జిల్లాను అభివృద్ధిపథం లోకి తీసుకెళ్లాలనే తపన ఉండాలి. అపుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ప్రతి శాఖలో కేటాయించిన లక్ష్యాలను సాదించేందుకు శ్రద్ధ తో పనిచేయాలని చెప్పారు. స్వచ్ఛసర్వేక్షన్ లో లక్షకంటే ఎక్కువ జనాభా కలిగిన వాటిలో జిల్లాలో కడప, ప్రొద్దుటూరు లు ఉన్నాయని, 2019 లో ఈ రెండు పట్టణాలు 20లోపు ర్యాంక్ పొందేలా కృషి చేయాలని సూచించారు. విద్యా, వైద్యం అంశాలలో జిల్లా ప్రగతి తక్కువగా ఉంది. ఆ రంగాలలో ప్రగతి సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే హార్టికల్చర్, మైక్రో ఇర్రిగేషన్, సిరికల్చర్, అగ్రికల్చర్ రంగాలలో మరింతగా ప్రగతి సాదించాల్సి ఉంది. ఇందుకు తగిన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఏ అంశంలో నైనా ఇతర ప్రాంతాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే వాటిని ఇక్కడ అమలు చేయాలని భావిస్తే సంబంధిత అధికారులు వివరాలు తెలిపితే ఆయా ప్రాంతాలకు పరిశీలన కొరకు అధికారులను పంపుతామని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కూడా స్టేట్ ఎక్సెలెంట్ అవార్డు లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఆయా శాఖలు అత్యుత్తమ ప్రతిభ కనబరచి అవార్డ్ పొందేందుకు కృషి చేయాలని కోరారు. తనను సన్మానించినందులకు అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.