నిష్కళంక దేశ భక్తుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికి ఆదర్శప్రాయం. స్వాతంత్ర్యోద్యమంలో దేశం కోసం తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన మహోన్నత వ్యక్తి… దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ లోని మీకోసం హాల్ నందు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 147 జయంతిని పురస్కరించుకుని జేసీ, జేసీ2 శివారెడ్డి, డిఆర్ఓ ఈశ్వరయ్య తదితరులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను పిల్లలకు తెలియజేయాలన్నారు. భావితరాలకు ఆయన జీవితం మార్గదర్శక మన్నారు. ఆయన ఉద్దేశ్యాలను నెరవేర్చేందుకు మనమందరం కృషిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ2 శివారెడ్డి మాట్లాడుతూ….ప్రకాశం పంతులు ప్రజలకు సేవ చేయడంలో నిక్కచ్చిగా ఉండేవారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఆనాటి 3కోట్ల తెలుగువారి తరపున చేసిన ఆయన చేసిన ఉద్యమం సువర్ణ అక్షరాలతో లిఖించతగిందన్నారు. న్యాయవాదిగా తను సంపాదించిన డబ్బునంతా ప్రజలకోసం అర్పించిన మహోన్నత వ్యక్తి అని, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలు, త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ అధికారులు కూడా నివాళులు అర్పించారు. అంతకు ముందుగా జేసీ కడప పట్టణంలో గల శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.