Tuesday, June 6, 2023

కొంపలు కూల్చే కులం

“కులమనేటి తెగులు కొంపలు గూల్చును
చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము
చలము చంపు గురుడైన విప్రుండు
కాళికాంబ!హంస!కాళికాంబ!”

కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ చంపగలిగినవాడు గురువైన విప్రుడు. వేలయేళ్ళుగా భారతదేశాన్ని శాసిస్తున్న కులవ్యవస్థ సృష్టించిన విధ్వంసాన్ని అందులోని నిరంకుశత్వాన్ని కళ్ళారా చూశారు బ్రహ్మంగారు. అలాగే చలం మితంమాలిన స్వార్థం అనేరోగంతో మనుషులు సతమతం కావడం అది సృష్టించిన విధ్వంసాన్ని కూడా ఆయన గమనిం చారు. ఈరెండు తెగుళ్ళనూ చంపగలిగినవాడు గురువైన విప్రుడు అన్నారు బ్రహ్మంగారు. ఎందుకంటే ఆయన దృష్టిలో గురువు కులానికీ స్వార్థానికీ అతీతుడు. శ్రమవిభజన గా మొదలైన కులం శ్రామిక విభజనగా మారిపోయింది. ఆరువేలకు మించినకులాలు మనదేశాన్ని లోపలలోపలే కుళ్ళగించి పారేసింది. స్వార్థపరశక్తులు కులవ్యవస్థను నిచ్చెనమెట్ల వ్యవస్థగా చేసి దానిని దైవకర్తృత్వాన్ని కల్పించి దానికి జన్మల కర్మ సిద్ధాంతాన్ని జోడించి ఒక కొరకరానికొయ్యగా మార్చేశాయి. కులసాంకర్యాన్ని నివారించడానికి శిక్షలతో భయపెట్టాయి. అందుకే బ్రహ్మంగారు కులం మనకొంప కూల్చుతుంది అన్నారు. అలాగే కులం మనదేశం అనేకొంపను కూల్చింది. లేకుంటే మనదేశం శతాబ్దాలకొలదీ విదేశీపాలనలో మ్రగ్గేదికాదు. కర్మసిద్ధాంతం మనదేశాన్ని నిర్వీర్యం చేసేసిందని బళ్ళారి రాఘవ అన్నారు. ఒక కులానికీ మరోకులానికీ కుదరదు. సంబంధ బాంధవ్యాలుండవు. అనేక ఆంక్షలు. దీనికి కొనసాగింపుగా చలం అంటే నిలకడలేనితనం. నిరంతరం ఏదో సంపాదించాలి. ఇంకా సంపాదించాలి. పైన వేదాంతం లోన ఆశ. దీనికోసం రకరకల ఎత్తుగడలు. వ్యక్తులమధ్య సమూహాలమధ్య ఘర్షణలు. వీటికి విరుగుడుగా గురువైన విప్రుడుగా చూపారు బ్రహ్మంగారు. విప్రుడు అంటే మనం బ్రాహ్మణుడని సాధారణంగా అనుకుంటాం. అయితే కులవ్యవస్థను ఆధిపత్యవ్యవస్థను తీవ్రంగా వ్యతరేకించే బ్రహ్మంగారు కేవలం బ్రాహ్మణుడనే అర్థంలో విప్రశబ్దాన్ని ఉపయోగించే అవకాశంలేదు. తనను ఇతరులను పాపంనుండి విశేషంగా రక్షించేవాడు విప్రుడు అని విప్రశబ్దానికి అర్థం. విప్రులలో బ్రాహ్మణులుకూడా ఉండవచ్చు. బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మంగారి దృష్టిలో విప్రులుకారు. స్వార్థం నుంచి గురువు సమాజాన్ని విముక్తం చేస్తాడు .ఆయన స్వార్థపరుడు కాదుగనక. ఆయనే కులాన్ని చంపగలడు. ఆయన కులంరోగి కాదుగనక. ఆయన ఈరెంటినీ ఎలా చంపగలడు? ఆయన దగ్గర ఏమంత్రదండం ఉంది? ఆయన దగ్గర విద్య ఉంది. విద్యద్వారా మనిషిని కులంనుండి , దురాశ నుండి దూరం చేయగలడు. ఈపద్యం చదివితే కులోన్మాదులు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. విద్యావ్యవస్థ ద్వారా మన రాజ్యాంగంలో మనం రాసుకున్న సెక్యులరిజం లౌకికవాదాన్ని సాధించాలంటే బ్రహ్మంగారిని మనం పాఠ్యాంశంగా చేర్చాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular