మహిళా శిశు అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే జిల్లాను నెంబర్ వన్ గా నిలపాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు పరిటాల సునీత మహళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక సభాభావనం లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ లతో కలిసి జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై ఐసిడిఎస్ అధికారులు, సీడీపీఓ లు, సూపర్ వైజర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు లలో అన్న అమృత హస్తం, బాలామృతం ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదేనన్నారు.
పౌష్టికాహార లోపం ప్రధాన శత్రువని, దీని నివారణ కోసం ఈ ఏడాది రూ.400కోట్లు అదనంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. సీడీపీవోలు పథకాలపై సరైన అవగాహన లేకపోతే పథకాలు పక్క దారి పడతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల బరువు, ఎత్తు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. జిల్లాలోని పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరని, అలాగే వయస్సు కు తగ్గ బరువు అంశంలో కూడా వెనుకబడి ఉన్నట్లు పేర్కొన్నారు. పోషకాహార లోపమో ప్రధాన కారణమన్నారు. జిల్లాలో చాలా అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేనట్లుగా తన దృష్టికి వచ్చిందని,
ఈవిషయంలో కలెక్టర్ చొరవ చూపాలని కోరారు.
ఐసిడిఎస్ కార్యక్రమాల అమలులో అంగన్వాడీ కార్యకర్త తన కేంద్రం పరిధిలో క్షేత్ర స్థాయిలో పథకాలను, అమలును పక్కగా తీసుకెళ్లాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా, వసతులు కల్పనలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ ఉద్దేశ్యాల మేరకు పథకాలు సక్రమంగా అమలు చేయకుండా, విధులు నిర్వహణ లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సమావేశంలో ఐసిడిఎస్ రాష్ట్ర ప్రత్యేక కమీషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ…. జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉందని, ప్రాజెక్ట్ లో లక్ష్యం మేర పౌష్టికాహారం అందించి ప్రగతి సాధించాలని సూచించారు.
జిల్లాలో రాయచోటి, ఎల్ ఆర్ పల్లి, రాజంపేట, ప్రొద్దుటూరు మండలాల పరిధిలో ఆన్లైన్ డాటా వివరాలు నమోదుశాతం తక్కువగా ఉందని, వందశాతం నమోదు వివరాలు పూర్తి చేయాలని సీడీపీవోలను ఆదేశించారు. అన్న అమృతహస్తం లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు సమతుల పౌష్టికాహారం గా రైస్, దాల్, ఆకుకూరపప్పు, 200ఎంఎల్ పాలు, 40 టు 50 గ్రామ్స్ వుండే ఒక గుడ్డు ఇస్తున్నామని ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లలో భాగంగా అమలు చేసే కార్యక్రమాలపై చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు, సీడీపీఓ లు, సూపర్ వైజర్స్ కు సరిఅయిన అవగాహన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో ప్రతి నెలా పిల్లలకు అన్న ప్రాశనా, గర్భిణీలకు శ్రీమంతాలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీరు, టాయిలెట్, విద్యుత్ సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తిచి వాటి వివరాలని ఐసిడిఎస్ పిడి ద్వారా కలెక్టర్ కు నివేదిక సమర్పించాలని సూపర్ వైజర్స్ ను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, మహిళలు, పిల్లలను బరువు చూడడానికి 4 రకాల వేయింగ్ మిషన్స్ ఈ నెలాఖరులోగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ… శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన కార్యక్రమాలను మంత్రి దిశా నిర్ధేశం మేరకు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఆహార లోపంతో బరువు తక్కువ పిల్లలు 11 శాతం, వయసుకు తగ్గ బరువు లేని వారు 35శాతం, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 7శాతం ఉన్నట్లు అంచనా ఉందన్నారు. కొన్ని క్లస్టర్ల లో రక్తహీనత ఎక్కువగా ఉందన్నారు. ఐసిడిఎస్, హెల్త్, ఎన్ ఆర్ ఈ జి యెస్ శాఖలను సమన్వయం చేసి కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. బరువు సరిగా లేని పిల్లలు 11 శాతం నుంచి 7 శాతానికి, వయసుకు తగ్గ బరువు లేని వారు 35శాతం నుంచి 25 శాతానికి, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 7శాతం నుంచి 5 శాతానికి తీసుకు రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రాథమికంగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని, ఆ మేరకు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమాల అమలుకు డిఎంహెచ్ఓ అధ్యక్షతన ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 3600 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్, త్రాగునీటి వసతి ఉందని, అన్నిటిలో మరుగుదొడ్లు కట్టిస్తామని చెప్పారు. ప్రైవేటు భవనాలలో ఉన్న 1600 అంగన్వాడీ కేంద్రాలలో 500 అంగన్వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణం వివిధ దశలలో ఉందని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. మిగిలిన 1100 కేంద్రాలకు భవనాలు త్వరలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 70 అంగన్వాడీ వర్కర్స్, 30 మినీ వర్కర్స్, 375 హెల్పేర్స్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
వారం లోగా భర్తీ చేస్తామని అన్నారు. ప్రహరీ గోడ ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సమీక్ష సమావేశం లో జేసీ2 రామచంద్రా రెడ్డి, ఐసిడిఎస్ పిడి పద్మజ లు పాల్గొన్నారు.