ysrkadapa

రాచపాలెం

సజ్జనుడు-దుర్జనుడు

సర్వదేవతలను సర్వమతాలను
సమముగా జూచు సజ్జనుండు
దుర్జనుండు లాతి దోషమ్ములను నెంచు
కాళికాంబ!హంస!కాళికాంబ
మంచిమనిషి అందరు దేవుళ్ళను అన్నిమతాలను సమానంగా తెలుసుకుంటాడు. చెడ్డమనిషి వాటిలో దోషాలు లెక్కబెడతాడు. వీరబ్రహ్మంగారు భారతదేశంలో అనేక దేవతారాధన వ్యవస్థ, అది సృష్టించే సామాజిక సంఘర్షణ, అనేక మతవ్యవస్థ అది సృష్టించే ఉత్పాతం…వీటిని జాగ్రత్తగా పరిశీలించారు. మతాలూ దేవతారాధనలూ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. దీనివల్ల మనుషుల మధ్య చీలికలూ గొడవలూ జరుగుతున్నాయి. వీటిచుట్టు స్వార్థపరులు చేరి వత్తిని ఎగదోసి పబ్బంగడుపుకోవడమూ ఆయన గుర్తించాడు. వీటికి పరిష్కారంగా ఆయన విగ్రహాలలో ఏమీలేదని అంతా శరీరంలో మనసులో ఉందని ప్రచారం చేశారు. అయితే బాహిరకర్మకాండకు అలవాటుపడిన జనం ఆయన ప్రబోధాన్ని అప్పటికి గ్రహించలేకపోయింది. చిరకాలపు విశ్వాసాలూ అలవాట్లు అంతతొందరగా పోవు. అవి ఇప్పటికీ పోలేదు. అలనాటి సంఘర్షణలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అదువల్ల బ్రహ్మంగారు ఒక రాజీ సూత్రం ప్రతిపాదించారు. అందరు దేవుళ్ళు అన్నిమతాలు ఒకటేనని తెలుసుకోమన్నారు. అలా తెలుసుకున్నవాడు సజ్జనుడు. ఎదుటిమతాన్ని కించపరిచేవాడు, ఇంకొకదేవుణ్ణి నిందించేవాడు దుర్జనుడు అని తీర్పునిచ్చాడు. అన్నిమతాలసారాన్ని గ్రహించమన్నాడు. అన్ని ప్రాణులను సమానంగా చూడమన్నాడు. అయినా జనానికి అర్థంకాలేదు. కనీసం ఘర్షణల్ని నివారిద్దాం అని  మంచిమనిషైన వాడు  దేవతలందరినీ,  మతలన్నిటినీ సమంగా తెలుసుకుంటాడనీ, చడ్డవాడు మాత్రమే తనకు నచ్చని మతాలనూ దైవాలనూ నిందిస్తూ ఉంటాడన్నారు. బ్రహ్మంగారు 17వ శతాబ్దంలో చెప్పిన ఈపద్యం 21వ శతాబ్దానికి కూడా అవసరమై ఉంది. సామాజిక మాధ్యమాలలో మతోన్మాదుల ప్రేలాపనలు వింటుంటే వీళ్ళు ఏశతాబ్దంనాటి అవశేషాలురా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరి కులాన్ని మతాన్ని గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ఒకపార్శ్వం. ఇంకో కులం ఇంకో మతం నీచమైంది, తుచ్ఛమైంది అని నిందించడం మరోపార్శ్వం. ఒకరోజు ఒక మతాన్ని ఒకడు నోటికొచ్చినట్టు తిట్టితే మర్నాడు ఇంకొకడు వచ్చి వాడిమతాన్ని తిట్టడం. ఇందులో మానవ మర్యాదగానీ భాషా సంస్కారంగానీ ఉండవు. ఒక శాస్త్రజ్ఞుడు ఒకవిషయాన్ని కనుగొంటే అతను పలానా మతానికి చెందినవాడు కావడం కారణమంటాడు. ఆమత గ్రథం కారణమంటాడు. ఏమిటి దీనికి నిదర్శనం?  కులాలతో మతాలతో వాటిదేవుళ్ళతో సంబంధం లేకుండా శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు జీవితాలను వెచ్చించి ప్రకృతి రహస్యాలను ప్రపంచ రహస్యాలను కనుగొని సర్వమానవాళికీ ఆజ్ఞానాన్ని అందిస్తున్నారు.  మానవజీవితం సుఖసంతోషాలతో సాగడానికి అవసరమైన సకలవస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. టెలివిజన్‌, కంప్యూటర్, వాట్సప్, ఫేస్ బుక్, విమానం, రైలు, రాకెట్ వంటి వాటిని మానవ మేధస్సే సృష్టిస్తున్నది. కులం, మతం దేవుళ్ళు వాటిని సృష్టించలేదు. సైన్సు సంధించిన పరికరాలను వాడుకుంటూ అశాస్త్రీయమైన  భావాలను ప్రచారం చేసుకుంటున్నాయి స్వార్థశక్తులు.  దూరదర్శన్ కనిపెట్టిన సైంటిస్టు పలానామతంవాడు  కావడంవల్లనే కనిపెట్టగలిగాడు  అనడం ఏమి విజ్ఞత. అందుకే ఆదేవుళ్ళు ఆమతాలు ఉంటే గింటే అన్నీ ఒకటే అని అనుకోమన్నారు బ్రహ్మంగారు. ఆయన కాలజ్ఞాని.

Leave a Comment