ysrkadapa

రాచపాలెం

కష్టపడి బతికేవాళ్ళే గొప్పవాళ్ళు

అష్టమదములున్న అధమాధముండగు
కష్టపడెడువాడు ఘనుడు జగతి
పరులకూటికాసపడును దౌర్భాగ్యుండు
కాంబ!హంస!కాళికాంబ……

అష్టమదములు అంటే అన్నమదం, అర్థమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం , ఉద్యోగమదం, యౌవనమదం. ఈ ఎనిమిది మదాలు తలకెక్కినవాడు అధములలో అధముడు. కష్టపడేవాడే గొప్పవాడు. ఇతరులకూటికి ఆశపడేవాడు దౌర్భాగ్యుడు . బ్రహ్మంగారు తనకాలంనాటి అసమ సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించి చేసిన విశ్లేషణ ఈపద్యం.   ఉక్కళంగా అన్ని సౌకర్యాలూ సమకూరినవారు, ప్రతిదానికీ కష్టపడుతున్నవాళ్ళను బ్రహ్మంగారు గమనించారు. అన్నీ సమకూరిన వారికి కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. వాటికి నోచుకోని వాళ్ళపట్ల చులకనభావం కనబరుస్తున్నారు. అహంకరిస్తున్నారు. అయినా ఆమదమెక్కిన వాళ్ళు అధములలో అధములన్నారు బ్రహ్మంగారు. కష్టపడి బతికేవాళ్ళే గొప్పవాళ్ళు అని ఆయన తీర్పునిచ్చారు. తాతముత్తాతలు సంపాదించి పోయినదానితోనో నానాగడ్డి కరచి అడ్డదారులు తొక్కి  ఐశ్వర్యవంతులై దానితో కళ్ళుమూసుకు పోయినవాళ్ళు సంపన్నులైతే కావచ్చుగానీ మనుషులుగా మాత్రం నికృష్టులే. వాళ్ళ సంపదంతా పరులకూడే. ఎవరికో కష్టపడే వాళ్ళకు చెందవలసిన దానిని మింగేసి ధనవంతులయ్యారు. అందువల్ల వాళ్ళు దౌర్భాగ్యులు అన్నారు. ప్రతిదీ నిజాయితీగా కష్టంచేసి సంపాదించేవాళ్ళు పేదవాళ్ళైనా గొప్ప వాళ్ళవుతారన్నారు.  అధర్మ సంపాదనాపరుల ఆగడాలను చూసి బ్రహ్మంగారు  శ్రామిక జనం వైపు నిలబడటం 17వ శతాబ్దంలో పెద్దవిప్లవమే. సంపన్నవర్గ వ్యతిరేకత పాలకవర్గ వ్యతిరేకతే. ఆర్థిక సాంఘిక అసమానతలను శాశ్వతం చేయడానికి సృష్టంచబడిన కర్మ సిద్ధాంతాన్ని బ్రహ్మంగారు ఆనాడే తిరస్కరించారు. ఆ తిరస్కరణ ద్వారా ఆయన పాలకవర్గం కొమ్ముకాసి బతికే విశ్రాంతివర్గం మీద యుద్ధమే ప్రకటించారు. అందుకే సంపన్నులను గొప్పవాళ్ళుగా గుర్తించి గౌరవించే సంప్రదాయాన్ని తీసిపారేశారు. శ్రమను గౌరవించి శ్రమికులే గొప్ప మనుషులని చాటిచెప్పారు. ఆర్థికస్థితికీ గొప్పతనానికీ సంబంధంలేదని తేల్చి చెప్పారు. వేమనకూడా కులముగలుగువారు గోత్రమ్ముగలవారు విద్యచేత విర్రవీగువారు పసిడిగలుగువాని బానిస కొడుకులని  విమర్శించారు. ఆమార్గంలోనే బ్రహ్మంగారు సామాజిక విమర్శకు పూనుకున్నారు. సంపదను చూసి అహంకారులకు ఊడిగం చేసేవాళ్ళకు బ్రహ్మంగారిపద్యం చెంపపెట్టు.

Leave a Comment