జూన్ 30 లోగా బిఎల్వోలు ఇంటింటి సర్వే పూర్తి చేసేలా కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆర్ పి శిశోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం “స్పెషల్ సమ్మరీ ఆఫ్ ఎలెక్టోరల్ రోల్స్ 2019, ఈఆర్ఓ నెట్” అంశాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ  స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపొందించడానికి కలెక్టర్లు కృషి చేయాలన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్ మేరకు జూన్ 30 లోగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని, జులై 31లోగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ, పోలింగ్ బూతుల భౌతిక పరిశీలన పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 31 వరకు అప్డేషన్ ఆఫ్ కంట్రోల్ టేబుల్స్, ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంట్స్, ప్రిపరేషన్ ఆ డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు.  సెప్టెంబర్ ఒకటో తేదీనాటికి ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్ రోల్‌ను పబ్లిష్ చేయాలని చెప్పారు. దీనిపై వచ్చిన క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ను సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 31వరకు స్వీకరించి వాటిని నవంబర్ 30 లోగా పరిష్కరించాలన్నారు. 2019 జనవరి 3 లోగా డేటాబేస్ అప్ డేషన్, సప్లిమెంట్ కాపీ ప్రింట్ చేయాలని, జనవరి 4న ఫైనల్ ఎలెక్టోరల్ రోల్స్ ను పబ్లిష్ చేయాలని చెప్పారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు యూనివర్సిటీ లు, కాలేజ్ లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

గడువులోగా ఇంటింటి సర్వే పూర్తి

జిల్లాలో ఇప్పటివరకు 5 శాతం మేర ఇంటింటి సర్వే పూర్తి చేశారని, జూన్ 30 లోగా వందశాతం పూర్తి చేయడానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ఎన్నికల అధికారికి స్పష్టం చేశారు.  రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లాలో అందిన 32 వేల క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లలో రెండు వేలు పరిష్కరించామని, మిగిలిన 30 వేల క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు.  జిల్లాలో 2598 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, రేషనలైజేషన్ అనంతరం అవి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చుకు సంబంధించిన బకాయిలను మంజూరు చేయాలని కోరారు. స్పెషల్ సమ్మరీ రివిషన్ ఆఫ్ ఎలెక్టోరల్ రోల్స్ కు సంబంధించి జిల్లా లో తీసుకున్న చర్యలపై సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ లో నిర్ధేశించిన సమయం లోగా కార్యక్రమాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.   కలెక్టరేట్ లోని ఎన్ఐసీ కేంద్రంలోని  వీసీ హాలు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్తోపాటు  డీఆర్వో ఈశ్వరయ్య, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీవోలు దేవేందర్ రెడ్డి, వీరబ్రహ్మం, నాగన్న, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జయరాం, జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్,  సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.