అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే

రాచపాలెం
1,235 Views
అన్ని తనువులందు నాత్మ యొక్కటియని
చర్చచేసి పలువురర్చకులుగ
వారివారి యిచ్చవచ్చినట్లుందురు?
కాళికాంబ!హంస!కాళికాంబ!
అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అని పలువురు చర్చలు చేస్తారు. కానీ ఆతర్వాత ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ఉంటారు. బ్రహ్మంగారు భారతీయ సామాజిక వాస్తవికతను చాలా నిశితంగా పరిశీలించారు. భారతీయ తత్త్వశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల జీవితాచరణనూ గమనించారు. ముఖ్యంగా సామాజిక నిచ్చెన మీద పైమెట్టు మీద ఉన్నవాళ్ళు మిగతాజనానికి చెప్పే నీతులు వాళ్ళ వాస్తవిక ఆచరణలు జాగ్రత్తగా పరిశీలించారు. వాళ్ళు చెప్పేదానికీ వాళ్ళ ప్రవర్తనకూ మధ్య దూరం ఉండటం ఆయన గుర్తించారు. భారతదేశం ఒక గొప్పసూత్రాన్ని ప్రపంచానికిచ్చింది. ఆత్మవత్ సర్వభూతాని అన్నదే ఆసూత్రం. అన్ని ప్రాణులలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అని అర్థం. ప్రాణులకు శరీరం ఉందని మొదటి నుంచీ అందరికీ తెలుసు. ఆత్మకూడా ఉందని తర్వాతికాలంలో అప్పటి మేధావివర్గం చెప్పింది. నిజానికి ఆత్మవాదం భారతీయతత్వశాస్త్రంలో మొదటినుంచీ ఉన్నట్లులేదు. ఉపనిషత్తులకాలంలోనో, మధ్యయుగంలోనో కాశ్మీరశివాద్వైతం వచ్చిన తర్వాతో ఆత్మవాదం పుట్టిందని విద్వాంసులు చెబుతారు. అప్పడే అది సాహిత్యంలోకి కూడా ప్రవేశించింది. భరతుడు దండి కావ్యాత్మను గురించి మాట్లాడలేదు. కుంతకుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు ఆత్మను గురించి మాట్లాడారు. ఇదలా ఉంచుదాం. ఇందులో అభిప్రాయభేదాలు కూడా ఉండడానికి అవకాశం ఉండవచ్చు. అసలు ఆత్మ అనేది ఉందా అన్నది ప్రశ్న. కాసేపు ఉందని అనుకుందాం. ఉందనుకునే మన పూర్వికులు అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అని చెప్పారు. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని చెప్పారు. ఆత్మ దేనివల్లా నాశనం కాదనీ చెప్పారు. అలాంటప్పుడు అన్ని భూతాలలో ఉండే ఆత్మ ఒక్కటే అని చెప్పినవారు అన్ని భూతాలనూ సమానంగా చూడాలికదా ! కానీ చూడటం లేదు. మనుషులందర్నీ ఒకటిగా చూడనివాళ్ళు మిగతా ప్రాణులను ఎలా ఆదరిస్తారు? మనుషుల్ని కులాలుగా విభజించి కులాలమధ్య ఎక్కువతక్కువలు నిర్ణయించారు. కొన్ని కులాలకు గౌరవమూ కొన్నికులాలకు అగౌరవమూ కల్పించారు. ఒకకులానికీ మరోకులానికీ మధ్య గోడలు కట్టారు. అన్నిభూతాలలో ఉండే ఆత్మ ఒక్కటే అనే భావనకూ కులవ్యవస్థకూ సంబంధం లేదు. ఇదొక పెద్ద వైరుధ్యం. ఆత్మ ఒక్కటే అంటూ కులాల మధ్య అసమానతలు కల్పించిన దుర్మార్గాన్ని బ్రహ్మంగారు ఎత్తి చూపారు. సిద్ధాంతానికీ ఆచరణకూ మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.
సకల భూతాలలో ఉండే ఆత్మ ఒక్కటే అని నమ్మి దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తే కలిగే ఫలితమేమిటో బ్రహ్మంగారు మరో పద్యంలో చెప్పారు.
అఖిలభూతములకు నాత్మయొక్కటియని
గుర్తెరింగి మెలగు గుణికినెందు
మోహశోకములు సమూలమ్ముగా దెగు
కాళికాంబ!హంస!కాళికాంబ!
అన్ని భూతాలలో ఉండే ఆత్మ ఒక్కటే నని గుర్తించి అందుకనుగుణంగా అన్ని ప్రాణులపట్లా సమభావనతో ప్రవర్తించే గుణవంతునికి మోహం శోకం సమూలంగా తెగిపోతాయి. బ్రహ్మంగారిని చదవడమంటే మనలోని కశ్మలాన్ని కడుగుకోవడమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *