ఆత్మ విమర్శ చేసుకోవాలి

రాచపాలెం
349 Views

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డినరులకుండు లక్షణములు మరచి

క్రూరజంతువులుగ మారిపోయిరి జనుల్ 

కాళికాంబ!హంస!కాళికాంబ

జనం  నీతీ రీతీ లేకుండా నైతికంగా దిగజారిపోయి క్రూరమైన జంతువులుగా మారిపోయారు. 17వశతాబ్దంనాటి సామాజిక వాస్తవాలే బ్రహ్మంగారితో ఇంత కఠినంగా పలికించాయి. వ్యక్తి మనుగడకుగానీ ఒకజాతి మనుగడకుగానీ నైతికత జీవగర్ర వంటిది. ఒకమనిషి ,లేదా జాతి జీవించవలసిన తీరు నైతికత. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ వంటిది. ఒక మనిషి లేదా జాతి బతకవలసిన తీరుకూ బతికిన తీరుకూ మధ్య వైరుధ్యం ఏర్పడితే అది నైతిక పతనం. నైతికంగా పతనమైన వ్యక్తి జీవితంగానీ జాతి జీవనంగానీ ప్రమాదస్థాయికి చేరుకున్నట్లే లెక్క. నైతికంగా మిగతా ప్రాణులకన్నా ఉన్నతంగా ఉండవలసింది మనిషే. ఎందుకంటే మనిషికి మిగతా జీవరాశికి లేని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి మనిషే నీతికి దూరమైతే అతడు క్రూరమృగంతో సమానం అని బ్రహ్మంగారి తీర్పు. ఆయన నైతకంగా పతనం కావద్దు అని బోధించడంలేదు. జనం అప్పటికే పతనం అయిపోయి క్రూరమృగాలుగా మారిపోయారు అని ప్రకటించేశారు. 17వ శతాబ్దంనాటికే మానవజాతి మృగజాతిగా మారిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అప్పటి సమాజాన్ని చూసి ఆయన ఆప్రకటన చేశారు. మనం మన సమాజాన్ని పరిశీలిస్తే ఆయన ప్రకటన మన సమాజానికి కూడా వర్తిస్తుందా లేదా తెలుసుకోవచ్చు. ఒక ఉద్యోగి ఉన్నాడు. అతని చదువును బట్టి ఆఉద్యోగం వచ్చింది. ఉద్యోగం దేనికి ఇచ్చింది?  పౌరులకు సేవచేయడానికి. ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో జీవితం గడుపుతూ పౌరసమాజానికి సేవలందించడం ఉద్యోగి నైతికత.  అలాంటప్పుడు ఆఉద్యోగి తనదగ్గరికి పనులు చేయించుకోడానికి వచ్చే పౌరుల దగ్గర  పని చేసినందుకు లంచం తీసుకున్నాడంటే అతను నైతికంగా పతనమైనట్లు. ఒక అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఉపాధ్యాయుని నమ్మి పాఠశాలకు చదువుకోసం పంపిస్తారు. బడిలో అధ్యాపకుడు విద్యార్థినికి తండ్రితో సమానం. ఆ అధ్యాపకుడే తన విద్యార్థినిని నాశనం చేస్తే అతను నైతికంగా పతనమైనట్లే. ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్నవ్యక్తి చేయవలసిన పని తనవద్దకు వచ్చే పౌరులకు తనదగ్గరున్న జ్ఞానాన్ని బోధించడమే. ఆగురువే అత్యాచార హత్యాచార కేసుల్లో ఇరక్కున్నడంటే అతను నైతికంగా పతనమైనట్లు. ఇలాగే మనం రాజకీయ నాయకులను వ్యాపారులను  సమాజంలోని అన్నిరంగాలవాళ్ళనూ పరిశీలిస్తే మన సమాజం నైతికంగా ఏదశలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తలకేసులు,  ఆశ్రమాలలో జరిగే దుస్సంఘటనలు , విద్యాసంస్థల్లో జరిగే పనికిమాలిన సంఘటనలు వెలుగులోకి వస్తున్న అనేక సత్యాలు…. అనుమానంతో భార్య లను చంపుతున్న భర్తలు,  ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్నభార్యలు, కూతురిపైన్నే అఘాయిత్యానికి పాల్పడుతున్న తండ్రులు ,ప్రేమపేరుతో స్త్రీల ప్రాణాలు తీస్తున్న మొగవాళ్ళు, చట్టసభలలో ప్రశ్నలడగడానికి లంచం తీసుకునే నాయకులు ఇలా ఎన్నో సిగ్గుపడవలసిన సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి మన సమాజం నైతికంగా ఎలా ఉన్నదో తెలుసుకోడానికి సూచనలు. బ్రహ్మంగారి పద్యాలు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోడానికి పనికివస్తాయి. మనం వ్యక్తులుగానూ సమూహంగానూ ఆలోచించుకోడానికి ఆయన సహకరిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *