జిహ్వరుచులకొరకు జీవితలక్ష్యమే
విడుచువాడు తత్త్వవేత్తకాడు
నాల్కగట్టువాడు నారాయణుండౌను
కాళికాంబ!హంస!కాళికాంబ…..
ఇది తత్త్వవేత్తలని ప్రచారం చేసుకునే తిండిపోతులను గురించి బ్రహ్మంగారు చెప్పినపద్యం. మనషులు రెండురకాలుగా ఉంటారు. బతకడానికి అవసరమైనంత మేర ఆహారం తీసుకునేవాళ్ళు ఒకరకం కాగా, తినడానికే పుట్టినట్లు పొట్ట పగిలేట్టు మెక్కేవాళ్ళు ఇంకోరకం. తత్త్వవేత్త బతకడానికి తిండితినేవాడై ఉండాలి. కానీ తత్త్వవేత్తల వేషం వేసుకొని సామాన్య మానవులు తిన్నట్లుగా తినేవాళ్ళను బ్రహ్మంగారు గుర్తించి వాళ్ళను విమర్శిస్తూ ఈపద్యం రాశారు. త త్త్వవేత్తలు సంఘానికి అనేకరకాలుగా ఆదర్శవంతంగా ఉండాలి. ఆలోచనలో ఆచరణలో వాళ్ళు మిగతావాళ్ళకు అనుసరణీయులుగా అనుకరణీయులుగా ఉండాలి. లౌకికలంపటాలకు దూరంగా ఉండాలి. తిండిమీద ఆశ ఎక్కువగా ఉండరాదు. శారీరక మానసిక రుగ్మతలకు అతీతులుగా ఉండాలి. ప్రతి మనిషికీ ఒకజీవిత లక్ష్యం ఉండాలి. ఉంటుంది. ఉపాధ్యాయునికి మంచి ఉపాధ్యాయుడనిపించుకోవడం లక్ష్యం. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, సేవారంగాల వాళ్ళు, న్యాయవాదులు, ఉద్యమకారులు ఇలా అన్నిరకాల వాళ్ళకూ జీవితలక్ష్యాలుంటాయి. ఆలక్ష్యాన్ని సాధించడానికి జీవితమంతా కృషి చేయాలి. ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని సమాజం భావిస్తుందో అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే లోకం ఛీకొడుతుంది. నిరంతరం అధ్యయనం , బోధనంలలో నిమగ్నం కావలసిన అధ్యాపకుడు వాటిని వదిలిపెట్టి చెయ్యకూడని పనులలో కాలాన్ని ఖర్చుపెడుతుంటే అతను అధ్యాపకుడనే మాటకు తగడు. అలాగే తత్త్వవేత్త ఎలాఉండాలో మనసమాజం నిర్వచించుకుంది. అతడు హితవాక్ కావాలి. మితభుక్ కావాలి. కో రుక్ అంటే మితభుక్ అంటారు. త త్త్వవేత్త జిహ్వచాపల్యాన్ని చంపుకోవాలి. అతన్ని ఇతరుల నుండి వేరు చేసేది ఇదే. తిండిదగ్గరే తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ఇక మనసునేమి నియంత్రిస్తాడు? నిరాడంబరత, శారీరక మానసిక నియంత్రణలేని వాళ్ళు త త్త్వవేత్తలనిపించుకోలేరని బ్రహ్మంగారి అభిప్రాయం. తిండిమీదపడి జీవితలక్ష్యాన్నే విస్మరించవాడు తత్త్వవేత్త కాడు, నాలుకను కట్టడి చేయగలవాడే నారాయణుడౌతాడు అన్నారు బ్రహ్మంగారు. జీవితలక్ష్యాన్ని నిర్వచించుకోనివాళ్ళు, దానిని సాధించడానికి యత్నించని వాళ్ళు , పైగా లక్ష్యానికి వ్యతిరేకంగా నడిచేవాళ్ళు వ్యర్థజీవులు అంటారాయన. బ్రహ్మంగారి పద్యాలు పాఠకులను శ్రోతలను ఆత్మవిమర్శలో పడవేస్తాయి. త త్త్వవేత్తలను కూడా ఆయన పద్యాలు వదిలి పెట్టవు. త్త్వవేత్తలేకాదు. మామూలు మనుషులు కూడా అవసరానికి మించి తినరాదని బ్రహ్మంగారి అభిప్రాయం.
కడుపుమంట దీర్పగా దినవలె దేహి మిక్కుటముగ తిండి మెక్కువాని
పట్టి బందిలోన పడవేయవలె రాజు
జఠరాగ్నిని చల్లార్చడానికి అవసరమైనంతే తినాల దేహి. దేహి అంటే దేహముగలవాడు మనిషి. అతిగా తినే వాడిని రాజు పట్టి బంధించాలి అని తీర్పు నిచ్చారు బ్రహ్మంగారు. పట్టిబందిలోన పడవేయవలె అనడంలో వనరులను అవసరానికి మించి ఖర్చుపెట్టే భోజన ప్రియులమీద ఆయనకెంతకోపమో తెలుస్తున్నది. ఇవాళ పెళ్ళిళ్ళలో డిన్నర్ లలో గెట్ టు గెదర్ లలో ముప్పై నలభై వంటకాలు వండి వడ్డించేవాళ్ళు, వాటిని ఆబతోవేయించుకొని తినకుండా పారబోసే వాళ్ళు బ్రహ్మంగారిని చదవాలి. తిండిని గురించి బ్రహ్మంగారికి శాస్త్రీరమైన అభిప్రాయాలున్నాయి. వాటిని అర్థం చేసుకుందాం.ఆచరణలో పెడదాం.