ysrkadapa

రాచపాలెం

గురువును మించినవారు లేరు

చరణములను వ్రాలి శరణన్నవారికై సుకృతఫలములెల్ల చూరలిచ్చు గురుని మించువారు ధరలోన లేరయా కాళికాంబ!హంస!కాళికాంబ
విద్యార్థులు మనఃపూర్వకంగా ఆశ్రయిస్తే, శరణుకోరితే ఆయన తాను తన సుకృతాల ద్వారా సంపాదించిన జ్ఞాన సంపదనంతా దానం చేస్తాడు. ఈభూమి మీద విద్యార్థులకు గురువును మించినవారు లేరు. బ్రహ్మంగారిది గురుసంప్రదాయం. చాలా పద్యాలలో గురువు ఔన్నత్యాన్ని కొనియాడారు . ఆరన చెప్పిన గురువు తాత్విక గురువు. జీతం గురువు కాదు. జ్ఞాన గురువు. ఉత్తమ గురువులు ఉత్తమ శిష్యుల కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకు శిష్యులను జ్ఞానవంతులను చేయాలన్న తపన తప్ప మరో ధ్యాస ఉండదు. శిష్యులు కూడా జ్ఞానార్థులుగా ఉండాలి. నేర్పాలన్న నిబద్ధత గురువుకున్నపుడు శిష్యులకుకూడా నేర్చుకునే నిబద్ధత ఉండాలి. శిష్యుల జ్ఞానతృష్ణ పైన గురువుకు నమ్మకం కలిగితే ఆరన జ్ఞానాన్నంతా శిష్యులపరం చేస్తాడని బ్రహ్మంగారు చెప్పారు. అలాంటి గురువును మించినవాడు ఈభూమి మీద ఇంకొకరులేడు అని కూడా స్పష్టం చేశారు. ఆయనే ఒక పద్యంలో తల్లి తండ్రి గురువు దైవంలలో తల్లిని మించిన వాళ్ళు లేరు అన్నారు. అదొక పార్శ్వం. ఏబిడ్డకైనా తల్లి తొలి గురువు. ఇందులో సందేహం లేదు. అయితే వ్యవస్థీకృతమైన విద్య దగ్గర గురువు పాత్ర తిరుగు లేనిది. అందుకే బడిలో విద్యార్థులకు గురువులే తల్లిదండ్రులని రూఢి ఏర్పడింది. బ్రహ్మంగారి దృష్టిలో గురు శిష్య సంబంధం వ్యాపారాత్మకం కాదు. విద్యార్థులను తనలాంటివారుగా తీర్చిదిద్దాలనే గుణాత్మక సంఖల్పంగలవాడే ఉత్తముడైన గురువు. అందుకే వీరబ్రహ్మంవంటి గురువు సిద్ధయ్యవంటి శిష్యుడు లేరని రూఢికెక్కింది. నేటి ఉపాధ్యాయులకు జీతం తీసుకునేవాళ్ళే అయినా బ్రహ్మంగారి వంటి గురువులుగా తయారవ్వాలనే తపన ఉండాలి. సాధ్యమైనంత వరకైనా అలా ఉండడానికి ప్రయత్నించాలి. వృత్తి పట్ల నిబద్ధత, గౌరవం విద్యార్థుల పట్ల ప్రేమ ఉండాలి. వృత్తికి కళంకం తెచ్చే బలహీనతల నుంచి విముక్తం కావాలి. తాము జ్ఞానవంతులై తమ విద్యార్థులను జ్ఞనవంతులను చేసి సమాజాన్ని జ్ఞానమయం చేయాలి. వర్తమాన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోడానికి బ్రహ్మంగారు పనికొస్తారు.

Leave a Comment