Tobaccoపొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని చాటిచెబుతూ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం కోసం ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలతో కలసి ఏర్పాటు చేసిన ప్రదర్శనను వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారి ఎన్‌.ఉమాసుందరి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  కోటిరెడ్డి, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.

పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం

ఈసందర్భంగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పొగాకు ఉత్పత్తులు  శరీర ప్రధాన అవయవాలపైన ప్రభావం చూపి కేన్సర్‌కు దారితీస్తుందని అధికారి ఉమా సుందరి హెచ్చరించారు.  దగ్గు, ఆయాసం, అలసట, శ్వాస ఆడక పోవడం వంటి  లక్షణాలతో రక్తపోటు, గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  పొగాకు ఉత్పత్తులు వినియోగాన్ని ఆపితేనే  ఆరోగ్యంగా ఉండగలమని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామిరెడ్డి, ఆరోగ్య విద్యాధికారి   గుణశేఖర్, డీపీఎంవో ఉమా మహేశ్వర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ లక్ష్మీకర్‌, ఎన్సీసీ బెటాలియన్‌ కెప్టెన్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నరు.