తెదేపాలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రచిస్తూ ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండగా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ముందొచ్చిన కొమ్ములకంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో అసంతృప్తి పరిధి దాటింది. వర్గ విభేదాలకు స్వస్తి చెప్పి ఐక్యతతో పని చేస్తున్నామని ఒకవైపు చెప్పుకొంటున్నప్పటికీ.. మరో వైపు ఒకరినొకరు గోతులు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షనేతవైఎస్ జగన్ స్వంత జిల్లాలో నాయకుల మధ్య విబేధాలు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి. వైకాపాకు చెందిన శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో ఆ పార్టీకి కొత్తగా తలనొప్పులు తెచ్చాయనే చెప్పవచ్చు. మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు తెలుగుదేశం పార్టీలోకి చేరికతో ఆయా నేతల మధ్య ముసలం మొదలైంది. మీడియా సమావేశాలతో ప్రతిలకెక్కుతున్నారఉ. జగన్‌ను స్వంత జిల్లాలోనే బలహీన పరిచే చర్యల్లో భాగంగా జమ్మలమడుగులో వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవిలో కూర్చోబెట్టారు. రాజ్యసభ సభ్యుడు రమేష్ నాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిల మధ్య విబేధాలు ఉన్నాయి. 17వతేదీన మైదుకూరులో జరిగిన మినీ మహానాడులో మంత్రి ఆదినారాయణరెడ్డి నాయకుల మధ్య గ్యాప్ ఉన్నట్లుగా రమేష్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సమక్షంలోనే ప్రకటించారు. కడప, రాజంపేట ఎంపీల రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగితే కలసికట్టుగా పనిచేస్తామనే అభిప్రాయాన్ని మంత్రి స్పష్టం చేయగా ఎంపీ రమేష్‌నాయుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయనే వాదన వినిపిస్తూ ఉండగా ఒక వర్గానికి మంత్రి ఆదినారాయణరెడ్డి మరో వర్గానికి రమేష్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఫలితంగానే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శలు సంధించుకొంటున్నారు. పార్టీ ప్రొద్దుటూరు బాధ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి , ఎంపీ రమేష్ నాయుడుపైనా విమర్శలు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వైకాపా కోవర్టంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శ బాణాలను సంధించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టడంతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, లింగారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు మధ్య, కమలాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిల మధ్య ఆదిపత్యపోరు సాగుతోంది. పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయోనన్న అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. జిల్లాలో నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి.. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేసుకుని రాబోయే ఎన్నికల్లో లాభపడేలా చూసుకోవాల్సిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య నెలకొన్న విబేధాలను ముఖ్యమంత్రి ఏవిధంగా పరిష్కరించుకొంటారో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

తెదేపాలో కుమ్ములాటలు
295 Views