ysrkadapa

రాచపాలెం

పెత్తనంలేని సమాజం


పాచిపీనుగైన బలవంతుడైనను
భీరువైన లేక ధీరుడైన
పెత్తనమ్ము చేయ తత్తరించు జనుండు
కాళికాంబ!హంస!కాళికాంబ…..

బలహీనుడైనా బలవంతుడైనా భయస్తుడైనా ధైర్యశాలి అయినా మనిషి పెత్తనం చేయడానికి తొందరపడుతూ ఉంటాడు. మనసమాజం పురుషస్వామ్య వర్ణ వర్గ సమాజంగా చాలా ఏళ్ళక్రితమే మారింది. రాచరిక వ్యవస్థ దీనిని కాపాడడానికే కృషి చేసింది. పోనీ ఆవ్యవస్థ అంటే పురుషస్వామ్య వర్ణ వర్గ వ్యవస్థ ప్రజలంతా సమాన సౌకర్యాలతో సమాన గౌరవంతో బతికిన సమాజమా అంటే కాదు.  ఎక్కడికక్కడ అసమానత వివక్ష పీడన దోపిడి  దౌర్జన్యం రాజ్యమేలిన చరిత్ర. ఇది ఎవడో ఊహించి చెప్పేది కాదు. ప్రజల అనుభవం.దీనిని శాశ్వతం చేయడానికి ప్రజలకు అనంతమైన వాజ్ఞ్మయాన్ని శాస్త్రాలరూపంలో సాహిత్యంరూపంలో సృష్టించారు.  దీనినంతా కలిపి బ్రహ్మంగారు పెత్తనం అని అందరికీ తెలిసినమాటలో చెప్పారు. ఒకమనిషిని మరొక్కమనిషీ ఒకజాతిని మరొక్కజాతీ పీడించే సాంఘిక ధర్మమే పెత్తనం. ఒక ప్రాణికొకప్రాణి ఓగిరం కావడమే పెత్తనం. మొగవాళ్ళు ఆడవాళ్ళమీద పెత్తనం. ఆరువేల కులాల నిచ్చెనమెట్లలో పైమెట్టు కిందిమెట్ల మీద పెత్తనం. పైకులం ఆడవాళ్ళు తమమొగవాళ్ళ పెత్తనంలో నలిగిపోతూ కిందికులాలకు చెందిన సాటి మహిళల మీద పెత్తనం. సంపన్నులు పేదవాళ్ళ మీద పెత్తనం. పైకులానికి చెందిన పేదవాడు కిందికులానికి చెందిన జరుగుబాటున్న వ్యక్తి అయినా అతనిమీద పెత్తనం. కిందికులాల మొగవాళ్ళు పైకులాల ఆడ మొగవాళ్ళచేత  బాధపడుతూ తమస్త్రీలపైన పెత్తనం. అభివద్ధిచెందిన ప్రాంతాలవాళ్ళు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలవారి మీద పెత్తనం. అభివృద్ధి ప్రాంతాల వాళ్ళు తీసే సినిమాలలో  ఇతర ప్రాంతాలను అవమానించడం ద్వారా పెత్తనం  ప్రజలమీద పాలకుల పెత్తనం.  పల్లెప్రజల మీద పట్టణ నగరవాసుల పెత్తనం.  వినియోగదారులమీద వ్యాపారుల పెత్తనం. నడిచివెళ్ళేవాళ్ళ మీద వాహన విహారుల పెత్తనం. అమాయకుల మీద తెలివైనవాళ్ళ పెత్తనం. మర్యాదకు తలవంచేవాళ్ళ మీద బరితెగించేవాళ్ళ పెత్తనం. అమ్మ బాబోయ్ ఈపెత్తనం ఎందెందు వెదకిచూచిన అందందే కలదు పెత్తనం వెదకిచూచినన్ అనిపిస్తుంది. పెత్తనం ఒక అనకొండ. వ్యవస్థలలో మార్పు వస్తున్నా పెత్తనం ఏదో ఒకరూపంలో కొనసాగుతున్నది. పెత్తనం అంటే నిరంకుశత్వం. ప్రజాస్వామ్యంకాదు. దీనిని బ్రహ్మంగారు ఎన్నడో గుర్తించి మనదృష్టికి తెచ్చాడు. ఈపద్యం లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ వంటిది. లక్ష్మణదేవర నవ్వుపాట వంటిది. ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈపద్యం గుర్తు చేస్తున్నది. ఇతరులను ఆర్థికంగా సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, వ్యక్తిగతంగా, సామూహికంగా, శారీరకంగా, మానసికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, తిట్లుగా, నిందలుగా, దుష్ప్రచారాలుగా, చేతలుగా, మాటలుగా ఎవరెవరు ఎవరెవరి మీద పెత్తనం చేసి నలిపి నాశనం చేస్తున్నరో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చే పద్యం రాసిన బ్రహ్మం గారికి నమస్కారం. అన్నిరకాల పెత్తనాన్ని గర్హిద్దాం. అసహ్యించుకుందాం. పెత్తనంలేని సమాజాన్ని నిర్మించుకుందాం. అది సలభ సాధ్యంకాదు. అది అనేకరకాల త్యాగం కోరుతుంది. బ్రహ్మంగారి పద్యం చూడడానికి మర్రివిత్తనం వంటిది. వ్యాఖ్యానానికి మహావృక్షం వంటిది.

Leave a Comment