వెల్లాలలో బ్రహ్మోత్సవాలు

రాజుపాలెం మండలంలోని వెల్లాల గ్రామంలో వెల్లసిన శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి ప్రారంభమై వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు వెల్లాల ఆలయ ఛైర్మన్‌ దుద్ద్యేల చంద్రశేఖరరెడ్డి తెలిపారు.  ప్రధాన ఉత్సవాలు 26న కల్యాణోత్సవం, 28న హనుమంతోత్సవం, 29న గరుడోత్సవం, వచ్చేనెల మే 1న రథోత్సవం జరగనన్నట్లు ఛైర్మన్‌, ధర్మకర్తలు తెలిపారు. వెల్లాల బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 1న రథోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో వృషభ రాజాలకు రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రథమ బహమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు మూడో బహుమతి రూ.50 వేలు, నాల్గో స్థానం ఎడ్లకు రూ.30 వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల బహుమతులను దాతలు విరాళంగా ఇస్తున్నట్లు వివరించారు.

 

అంజన్న నోట ‘వెల్లాల’ మాట
త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. రామరావణ సంగ్రామ సమయంలో లక్ష్మణుడు మూర్చ చెందగా శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు సంజీవిని మూలికా అన్వేషణలో వాయు పుత్రుడు ఆంజనేయస్వామి ఆకాశమార్గాన వెళ్తూ సంధ్యాసమయం కావడంతో సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం చేసేందుకు కుముద్వతీ (కుందూ నది) తీరంలో కాసేపు ఆగారు. విషయం తెలుసుకున్న అక్కడి మునిపుంగవులు స్వామిని దర్శించుకొని వారిని అక్కడే ఉండిపోవాలని ప్రార్థించారు.  శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు కార్యార్థినై వెళ్తున్నానని చెబుతూ.. మూడుసార్లు త్వరగా వెల్లాల వెల్లాల వెల్లాల అని పలికి సమయం మించి పోతున్నదని వారిని ఆశీర్వదించి.. తలుచుకుంటే మీ వద్ద సాక్షాత్కరిస్తానని సుఖసంతోషలతో ఉండాలని దీవించి ఆకాశ మార్గాన పయనమయ్యారు. స్వామివారి నోట మూడుసార్లు వచ్చిన వెల్లాల అనే మాట ఆ గ్రామానికి స్థిర నామమై వెల్లాలగా పేరు స్థిర పడింది. తిరుగు ప్రయాణంలో సంజీవని పర్వతాన్ని తీసుకెళుతున్నప్పుడు వారి చేతిలోని సంజీవిని పర్వతం పై నుంచి రెండు ప్రతిమలు జారి పడ్డాయని చెబుతారు. స్వామివారి నోటి మాటే ఆ ప్రాంతానికి వెల్లాల అని పేరును, ఇక్కడ వెలసిన స్వామికి సంజీవరాయుడు అనే పేరు సార్థకమైంది. ఆనాటి నుంచి మునులు ఇక్కడ వెలసిన స్వామివారిని సంజీవరాయ నామధేయంతో ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నారని పెద్దల మాట. శ్రీఆంజనేయస్వామి పాదస్వర్శతో పునీతమైన కుందూనది జలం పరమ పవిత్రకు సాక్షీ భూతంగా ఈ ప్రాంతం పుణ్యస్థలిగా భాసిల్లుతోంది.
* 15వ శతాబ్ధంలో హనుమత్‌ ముల్ల రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఆయనొకసారి తన పరివారంతో కుందూనది పరిసరాలలో వేటకు బయలు దేరగా మార్గంలో అనారోగ్య పీడితుడై ఈ ప్రాంతంలో కొద్దిరోజులు బసచేశారు. ఒకనాడు స్వప్నంలో ఆ రాజుకు ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి కుందూనదిలోని విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తే కలిగిన కష్టాలు బాధలు తొలగి పోతాయని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని తెలిపి అదృశ్యమయ్యారు. మరుసటి రోజు తన పరివారంతో నదిలో వెతకగా స్వామి విగ్రహం బయల్పడింది. ఒడ్డుకు చేర్చి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కుందూనది ఒడ్డున ప్రతిష్ఠించారు. నాటి నుంచి నిత్యపూజలు చేస్తున్నారు. రాతి విగ్రహం పెరగడంతో అర్చకులు స్వామి వారి శిరస్సుపై రాగి కలశం ఉంచారని, దాంతో పెరుగుదల ఆగి పోయిందని చెబుతారు. స్వామిని దర్శించుకుంటే  కొర్కెలు తీరుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *