నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చేరుకుంటారు. చెన్నమరాజుపల్లె పంచాయతీలోని నాగాయపల్లెలో నిర్వహించే గ్రామదర్శిని, చెన్నమరాజుపల్లెలో నిర్వహించే గ్రామసభలోనూ పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు కడప మున్సిపల్ మైదానం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులతో విద్య – ఉపాధి అంశాలపై ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు.  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టరు హరికిరణ్‌ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు హరికిరణ్‌ కోరారు.  వేసవి ఎండల నేపథ్యంలో గ్రామసభల్లో నీటి సరఫరా, మజ్జిగ ప్యాకెట్లను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడా, జేసీ నాగేశ్వరరావు, ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టరు-2 రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ హరిహరనాథ్‌, డీఆర్వో ఈశ్వరయ్య, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, కడప మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న తదితరులు పాల్గొన్నారు.