Friday, March 29, 2024

ఒంటిమిట్ట

కడప నుంచి 20కి.మీ దూరంలో రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్ళే దారిలో ఒంటిమిట్ట కోదండరామాలయం నెలకొని ఉంది. ఇక్కడి కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామ, సీత, లక్ష్మణుని చూడవచ్చు. ఒకే శిలపై విగ్రహాలు ఉండటంతో ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి “భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి” అని కీర్తించాడు. కోదండరామాలయం మిట్ట పైన నిర్మించడంతో ఒంటిమిట్ట గ్రామంగా గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ప్రచారంలో ఉంది. మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం చేశాడు. భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి కొంతకాలం పోతన ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. స్థల పురాణం : రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఆకర్షణీయ గోపురాలు ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 – 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల – రథం ఉన్నాయి. చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకిత మిచ్చింది కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీప వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధి తో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తి కి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular