బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నీటితో నింపడంతోపాటు ఆర్టీపీపీకి నీటి సరఫరాను నిలిపివేయాలనే డిమాండుతో సీపీఎం ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కలసపాడు నుంచి ఒక జాతా, అట్లూరు నుంచి మరో జాతా పాదయాత్రగా బయలుదేరి 21వ సాయంత్రం బ్రహ్మంగారిమఠం చేరుకునే ప్రణాళికను రూపొందించారు.
బద్వేలు నియోజకవర్గంలోని బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, కాశినాయన, అట్లూరు, గోపవరం మండలాలతోపాటు మైదుకూరు నియోజకవర్గం లోని బ్రహ్మంగారిమఠం మండలాల పరిధిలోని 1.55లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు బ్రహ్మంగారిమఠం, బద్వేలు తాగునీటి అవసరాలు బ్రహ్మంసాగర్‌ జలాశయం ద్వారా సరఫరా కావాల్సి ఉంది. 34ఏళ్ల కింద తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టినా పాలకుల నిర్లక్షంతో నేటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరక పోగా ఇప్పటిదాకా బ్రహ్మంసాగర్‌కు 17 టీఎంసీల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేదు. బ్రహ్మంసాగర్‌కు చేరే అరకొర నీటిలో ఆర్టీపీపీకి తరలిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, పి.వి. రమణ ఆధ్వర్యంలో అట్లూరు నుండి బి.మఠం వరకు మూడు రోజులపాటు పాదయాత్ర ప్రారంభం కానుంది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.చంద్రశేఖర్, జి శివకుమార్, పోరుమామిళ్ల ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ యన్.భైరవ ప్రసాద్ల ఆధ్వర్యంలో కలసపాడు నుంచి పోరుమామిళ్ల, అమగంపల్లె, మల్లెపల్లి మీదుగా బి.మఠం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. 21వ తేదీ సాయంత్రం 3 గంటలకు బ్రహ్మంగారిమఠం 5 రోడ్ల సెంటర్లో భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు.