జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని పశుసంవర్థక, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఈలోగా ఎన్నికల ఫలితం వస్తే ఎక్కడెక్కడ సమస్యలు ఉండాయో తెలిసిపోతుందని, ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు జరుగుతున్నాయన్నారు. తితిదే పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన మైదుకూరులో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి 13రోజులు చేసినా ఆయన్ను నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఉప ఎన్నికల్లో మంచి ఆధిక్యం చూపిస్తే 2019 నాటికి వైకాపా లేకుండా పోతుందన్నారు. జూన్ 2వ తేదీలోగా ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని కోరుకుంటున్నామని, ఎన్నికలు వస్తే నాయకుల మధ్య ఉన్న గ్యాప్ లేకుండా పోతుందన్నారు. ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో పెట్టిన 229 అంశాల్లో కేవలం 8మాత్రమే అమలు చేయాల్సి ఉందని రాబోయే ఎన్నికల నాటికి వాటిని అమలు చేస్తామన్నారు. రాష్ట్రం యూనిట్‌గా పశువులకు బీమా కల్పిస్తామని, వాటి విలువ ఆధారంగా బీమా చెల్లిస్తామన్నారు. మైదుకూరుకు మార్కెట్ యార్డు, రైతుబజారు, చేపల మార్కెట్, శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో సుధాకర్‌యాదవ్‌ను గెలిపించాలన్నారు. నాలుగేళ్లకాలంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిలు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. సుధాకర్‌యాదవ్ కృషితో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.
రాజీనామాలు చేసి జీతాలు తీసుకుంటారా?
రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలు జీతాలు తీసుకోవడం ఏమిటని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు అన్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. డబ్బు కోసం వైకాపా నాయకుల కక్కుర్తి బయటపడిందన్నారు. సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ నియోజకర్గంలో దాదాపు రూ.500కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మినీ మహానాడులో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.