మైదుకూరు సమీప ఎల్లంపల్లె గగ్గితిప్ప వద్ద లభ్యమైన శిలా శాసనం క్రీ.శ. 1428నాటి శాసనసంగా భారత పురావస్తు సర్వేరక్షణ అధికారులు తేల్చారు. నవంబరు 21న గగ్గితిప్ప వద్దకు చేరుకున్న భారత పురావస్తు, రాష్ట్ర పురావస్తు అధికారులు శాసన నమూనా సేకరించారు. పరిశోదన అనంతరం శాసనంలోని వివరాలను సర్వేక్షణ శాసన విభాగ అధికారి మునిరత్నం వెల్లడించారు.
ఇదీ చరిత్ర
విజయనగర సామ్రాజ్యాన్ని 15వ శతాబ్ధంలో రెండో దేవరాయులు పరిపాలిస్తున్న కాలంలో అతని సామంతుడైన సంబెట పిన్నయ్య దేవ మహరాజు ఎల్లంపల్లెకు ఉత్తరాన పేరనిపాడు పేరుతో పేట కోటను కట్టించి పాలన చేస్తూ ఉండేవాడు. అతని వద్ద రాజ్య వ్యవహారాలను చూస్తున్న హెగ్గడన్న తన తల్లి తిప్పలదేవి, తండ్రి సోమయ్య జ్ఞాపకార్థం గగ్గితిప్పకు పడమర దిశలో ఆలయాన్ని నిర్మించి అందులో ఆదిభైరవుడు ఇతర దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఆలయ నిర్వహణకు కొంత భూమిని దానం చేసి బావి తవ్వించారు. ఉద్యానవనం ఏర్పాటు చేయించినట్లుగా శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1428వ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గురువారం నాడు శాసనం వేయించారు.