ysrkadapa

వార్తలు

వైసీవీరెడ్డి

సీమ సాహిత్యంలో ఒక సమగ్ర సాహితీకోణం ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి (వైసీవీ) రచనలు. 1960 దశకంలోనే మేనకాది వైవిధ్య రచనలు ఆవిష్కరించి కవి పుంగవుల ప్రశంసలు అందుకున్న వైసీవీ నిండైన సాహితీ హృదయంగా ఆయన్నెరిగిన వారు పేర్కొంటారు. పల్లెటూరు పెద్దమనిషి కవి అయితే ఆయన కవితలో ఉన్న అభ్యుదయం ఏదో వైసీవీలో ప్రతి అక్షరంలో సాక్షాత్కరిస్తుంది. రైతు, రైతు కూలి, గాసగాడు (సేద్యగాడు) వడ్డీవ్యాపారి, గొడ్డుగోదా ప్రతి వేదన ఆయన కలంలో జాలు వారింది. నిత్యం గ్రామంలో తన కళ్లెదుట కనిపించే గ్రామీణ మహిళల వాస్తవిక వేదన తన గట్టిగింజల్లో ఆవిష్కరించారు. రాయబారం కావ్యంలో గాసగాని వేదన, రైతుపై ఆతనికున్న ప్రేమ వ్యక్తపరిచిన తీరు కులమతాలకు అతీతమై అనుబంధాలకు ప్రతీకగా పేర్కొనవచ్చు.వ్యవసాయ పనిముట్లకు, పదాలకు సాహితీ గౌరవం తెచ్చిన వాడుగా జిల్లా కవులు ఆయన్ను ప్రశంసించడం స్వభావోక్తియే. సంప్రదాయ రచనలు, విమర్శ, గేయకావ్యం, కథలు అన్నింటా కవితాసేద్యం చేసిన వైసీవీ కడప గడపలో కవుల గడపలు మెండన్న ఆత్మవిశ్వాసి. పులివెందుల తాలుకా బోనాల గ్రామంలో కొండారెడ్డి లక్ష్ముమ్మ దంపతులకు జన్మించిన వైసీవీ జిల్లా పరిషత్‌లో ఉద్యోగ విధులు నిర్వహించి కడప అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఆయన చేసిన సాహితీ సేవ ప్రశంసపాత్రమైంది. ఆయన రచనలు అన్నింటిని వైసీవీ రెడ్డి సమగ్రసాహిత్యం ఆవిష్కరణ, వెబ్‌సైట్‌ ప్రారంభం ఆదివారం ఆయన కుమారుడు విశ్రాంత చరిత్రోపన్యాసకులు వై.ప్రభాకర్‌రెడ్డి తీసుకొస్తున్న నేపథ్యంలో వైసీవీరెడ్డి గురించి సాహితీవేత్తల అనుబంధ వ్యక్తాభిప్రాయాలు పాఠకుల కోసం.

నిండైన కవి వైసీవీ  – ఎన్సీ రామసుబ్బారెడ్డి, రచయిత
నేను వైసీవీ ఒకే కార్యాలయంలో (ఆఫీసు) పనిచేశాం. మేనక, రంభ వంటి కావ్యాలు ఆయన 1954లో తీసుకొచ్చారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర సాహిత్యం పరిశోధన గ్రంథంలో వైసీవీ రచనలను ప్రకటిస్తూ నవ్యత్వం ఆయన మేనకాది కావ్యాల్లో ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిషేధ కాలంలో రహస్యం అనే రాతపత్రికను నడిపిన వ్యక్తి వైసీవీ. తుంగభద్ర ఎగువ కాల్వ సాధన కోసం దండాలు దండాలంటూ ఆయన రాసి గానం చేసిన కవిత పదిమంది రాజకీయ నాయకులను కదిలించింది. పెద్ద కవులకు అనుగుణంగా నడుచుకోవడంలో, చిన్నకవులను, ముఖ్యంగా యువకులను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. గజ్జల మల్లారెడ్డి, పుట్టపర్తి వంటి వారెందరితోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉంది. వ్యక్తిత్వం వేరు భావజాలం వేరన్న వాదాన్ని ఆయన గ్రహించినట్లు మరెవరూ గ్రహించలేరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగంలోనూ, వ్యవసాయంలోనూ, రచనలోనూ జీవితలోతులను దర్శించిన దార్శనిక కవి వైసీవీ.

కవి సహృదయుడు వైసీవీ రెడ్డి   – సత్యాగ్ని (షేక్‌హుసేన్‌) మాజీ ఎమ్మెల్సీ
వైసీవీ రెడ్డి కవితా సహృదయులు. ఔత్సాహిక రచయితలకు ఆయన్నిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. రచన చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి వారి రచనలు చదివి అవి పుస్తకంగా ప్రచురణ అయ్యేందుకు ఆయన చేసే కృషి ఇంత అని చెప్పలేం. 1987లో నేను తొలిసారిగా ముస్లిం మైనారిటీ వ్యవస్థలో ఉన్న స్త్రీల జీవితాలను చిత్రిస్తూ పాచికలు అనే పేరుతో ఆరు కథలు రాశాను. ఆయన కథలను ఆయన మాఇంటికి వచ్చి చదివారు. బొల్లిముంత రామకృష్ణ, దాశరథి రంగాచార్యలకు ఆయన పుస్తక ప్రతులను పంపి అభిప్రాయాలను రాయించారు. పాచికలు పుస్తక సమీక్ష నాడు నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఉదయం నిర్వహించాం. మధ్యాహ్నం ఆయన భోజనం చేసిన తరువాత గుండెపోటు వచ్చి కాలధర్మం చెందారు. అది నాకు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆయనతో కవితాగోష్ఠులు ఇన్ని అని చెప్పలేం. నేను శశిశ్రీ ఎన్నోసార్లు ఆయన చెంతకు వెళ్లి కవితా చర్చలు చేశాము. వాణి కళాపీఠం స్థాపించి జాషువా అవార్డును మొదటసారి పుట్టపర్తి వారికి, రెండవసారి వైసీవీకి ఇచ్చాం. రచయితగానే కాక, విమర్శకుడే కాక రచయితలను ప్రోత్సహించడంలో ఒక కవిగా ఉన్న వైసీవీ తరువాతనే ఎవరైనా.

కీర్తి కండూతి ఎరుగని గీష్పతి వైసీవీ  – సుబ్బరాయ కవి, కడప
వైసీవీ కీర్తి కండూతి ఎరుగని బృహస్పతి వైసీవీ. యువకులకు ఆయన్నిచ్చే ప్రోత్సాహం చాలా గొప్పది. నా వీపు అనే ఆకురాయి మీద మీ కలాలకు పదును పెట్టుకోమనే కవి సహృదయుడు ఆయన. పద్యం, గేయం, వచనం ఏది రాసి చూపించినా విసుగులేకుండా చదివి ఎన్ని తప్పులున్నా సరిదిద్ది నీవు రాయగలవు పైకి వస్తావని యువకులను ప్రోత్సహించడం నాకు ఇప్పటికి గుర్తు. నిజంగా అంటాం కానీ ఆయన లేని తీర్చలేనిదని.. కానీ వైసీవీ లేని లోటు నిజంగా వర్ధమాన రచయితలకు తీరని నష్టమే. తన వద్దకు వచ్చిన పామరుని సైతం పండితుని చేయగల శక్తిమంతుడు. తప్పుచేసే పురుషులకు సమాజంలో మళ్లీ అవకాశం ఇస్తారు. విధివశాత్తు ఇబ్బందుల్లో పడి పడుపువృత్తి చీకట్లలో చిక్కుకున్న మహిళకు సైతం ఒక అవకాశం ఇవ్వాలనే సహృదయుడు ఆయన. ఆయన మేనక, రంభ వంటి కావ్యాల్లో అలాంటి చైతన్యమే కనిపిస్తుంది. కమ్యూనిజం భావజాలం ఉన్న వైసీవీ పురాణాల విమర్శకోసం కావ్యాలే రాశారు.


Leave a Comment