ఏపీ జిల్లాల ఏర్పాటు 1974 సెక్షన్ 3(5) నిబంధన ప్రకారం చేపట్టిన పునర్విభజనతో పది నియోజకవర్గాలతో ఉన్న కడప జిల్లాను రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలను మినహాయించి కడప పార్లమెంట్ నియోజకవర్గంలోని బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలాన్ని కలిపి కడప జిల్లాగా చేశారు.
జిల్లాకు అద్భుతమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇది రాజధాని అమరావతికి 377.5కి.మీ, పెన్నా నదికి 8కి.మీ దూరంలో ఉన్నది. నగరం చుట్టూ మూడు వైపులా నల్లమల, పాలకొండలు ఉన్నాయి.
11,228 చ.కి.మీ. భౌగోళిక విస్తీర్ణం కలిగిన కడప జిల్లాలో కడప, బద్వేలు, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో రెవెన్యూ డివిజనలో 12మండలాల చొప్పున 36 మండలాలు ఉన్నాయి. అందులో 726 రెవెన్యూ గ్రామాలు, 557 పంచాయతీలు 2257 గ్రామాలు ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం మేరకు జిల్లా జనాభా 20,60,654. అందులో పట్టణ జనాభా 8,09,290, గ్రామీణ జనాభా 12,51,364 మంది ఉన్నారు. అందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 3,37,860, షెడ్యూల్డ్ తెగల జనాభా 40,994. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ కు 225 మంది.జిల్లా కేంద్రం కడపను మున్సిపల్ కార్పొరేషన్‌గా చేశారు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలైన బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలుగా ఉన్నాయి.