వైఎస్సార్‌ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8 న జమ్మలమడుగులోని క్యాంబెల్‌ ఆస్పత్రిలో  జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజా రెడ్డి. రాజారెడ్డి బళ్లారిలోని కాంట్రాక్టు పని చేస్తూ ఉండటం వల్ల పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలోని సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో సాగింది.  ఆతర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో చదువుకున్నారు.  1972లో గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య విద్య, తిరుపతి వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. జన్మించిన ఆస్పత్రి జమ్మలమడుగు క్యాంబెల్‌ ఆస్పత్రిలో  కొంతకాలం వైద్యాధికారిగా, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. సంతానం జగన్ మోహన్‌ రెడ్డి, షర్మిల.

రాజకీయ నేపథ్యం

1975లో ఆంధ్రప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1978 ఎన్నికల్లో  తొలిసారిగా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.  1983, 1985 జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1989, 1991, 1996, 1998లో కడప పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుస విజయాలను అందుకున్నారు. 2003లో 1467కి.మీ పాదయాత్ర చేపట్టారు. 12వ శాసనసభ ఎన్నికల్లో  (2004లో) తిరిగి అసెంబ్లీకి పోటీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలను తెచ్చి పెట్టారు. 12వ శాసనసభకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో 13వ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మరోసారి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. రాష్ట్ర ప్రజలకు విషాదాన్ని మిగిల్చారు.

అలంకరించిన పదవులు

1980లో తొలిసారిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ రెండోసారి  పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండగా ఆ సమయంలో వైఎస్సార్‌ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు.