కోవిడ్ 19, నివర్ తుఫాను సమయంలో హోంగార్డుల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు. ఆదివారం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హోంగార్డులు ప్రతి కార్యక్రమంలో మేము సైతం అంటూ విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని కొనియాడారు. హోంగార్డు ఆర్గనైజేషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హయాంలో ప్రారంభించబడిందని, వైఎస్ఆర్ కడప జిల్లాలో మొట్టమొదట ఒక కంపెనీగా ఉన్న కడప హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఏడు కంపెనీలుగా ఏర్పాటైందన్నారు. కరోనా, తుంగభద్ర పుష్కరాలు, నివర్ తుఫాను సమయంలో హోంగార్డులు ఎంతో క్రమశిక్షణగా సమర్ధవంతంగా విధులు నిర్వహించి మన్ననలు పొందారన్నారు. ప్రస్తుత పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని శాఖల్లో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి జీవన్ సురక్ష బీమా యోజన పథకం, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వైయస్సార్ ఆరోగ్యశ్రీ వంటి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజులలో హోంగార్డులు ఇంకా బాగా పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 710 మంది హోంగార్డులు చేస్తున్నారని పేర్కొన్నారు. హోంగార్డుల ద్వారా దాదాపు 2 వేల మంది వరద బాధితులను కాపాడడం జరిగిందన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనల సమయంలోనూ హోంగార్డుల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 18 వేలు నుంచి 21 వేల వరకు వేతనం పెంచినట్లు వివరించారు. జరిగిందన్నారు. కార్యక్రమానికి ముందు ఉప ముఖ్యమంత్రి, ఎస్పీ అన్బురాజన్లు హోంగార్డుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పోలీసు వాహనంలో పెరేడ్ ను పరిశీలించారు.

హోంగార్డుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
156 Views